ఇంటర్ బోర్డు రద్దు ఆలోచనపై కవిత ఫైర్.. డ్రాప్ అవుట్స్ లెక్కలపై సీఎం వ్యాఖ్యలకు కౌంటర్!

Inter Board

Inter Board

Inter Board:  డ్రాప్ అవుట్స్ పేరుతో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ సోమాజిగూడలో ‘ఇంటర్ బోర్డు రద్దు – తెలంగాణ విద్యపై ప్రభావం’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యా విధానంలో ప్రభుత్వం ఏవైనా కీలక మార్పులు చేయాలనుకున్నప్పుడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కాలేజీల యాజమాన్యాలతో కచ్చితంగా చర్చించాలని డిమాండ్ చేశారు.

గణాంకాలతో సీఎం వ్యాఖ్యలకు కౌంటర్

ఈ సందర్భంగా రాష్ట్రంలోని డ్రాప్ అవుట్స్ గణాంకాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఓవరాల్‌గా చూస్తే డ్రాప్ అవుట్స్ కేవలం 16 శాతం మాత్రమే ఉన్నాయని ఆమె వివరించారు. బాలికలే ఎక్కువగా చదువు మధ్యలో మానేస్తున్నారని సీఎం చెప్పడం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు.”ముఖ్యమంత్రి లాంటి బాధ్యతాయుతమైన హోదాలో ఉండి అబద్ధాలు చెప్పొద్దు.

వాస్తవానికి ఇంటర్మీడియట్‌కు వెళ్తున్న బాలికల సంఖ్య 77.4 శాతంగా ఉంటే.. బాలుర సంఖ్య కేవలం 68.4 శాతం మాత్రమే ఉంది. ఈ లెక్కలను బట్టి చూస్తే బాలికల కంటే అబ్బాయిలే ఎక్కువగా చదువుకు దూరమవుతున్నట్లు స్పష్టమవుతోంది” అని కవిత పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఇంటర్ బోర్డు వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఆమె హితవు పలికారు.