Snapchat Drug: మత్తుపదార్థాల సరఫరాదారులు పోలీసుల కళ్లుగప్పేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. సోషల్ మీడియా యాప్ ‘స్నాప్‌చాట్’ వేదికగా గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ దందా సాగిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను తెలంగాణ ఈగల్ ఫోర్స్ అధికారులు రట్టు చేశారు. హైదరాబాద్‌లోని టోలీచౌకికి చెందిన మొహమ్మద్ ఇద్రిస్ కలీమ్, ఆసిఫ్ నగర్‌కు చెందిన సయ్యద్ అర్మాన్ హుస్సేన్, గోల్కొండకు చెందిన మొహమ్మద్ షేక్‌లు మారుతి టూర్ హెచ్3 వాహనంలో ల్యాంకో హిల్స్ నుంచి మణికొండ, గచ్చిబౌలిలోని షిర్డీ సాయి నగర్ వైపు గంజాయి, ఓజీ కుష్ తరలిస్తుండగా నార్కోటిక్స్ పోలీస్ బృందం పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకుంది.
కోడ్ పేర్లు.. క్రిప్టో చెల్లింపులు
తనిఖీల్లో వీరి వద్ద నుంచి 1,240 గ్రాముల గంజాయి, 16.59 గ్రాముల ఓజీ కుష్, గంజాయి క్రషర్, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా స్నాప్‌చాట్‌లో ప్రత్యేక ఖాతాలు తెరిచి ‘OGdude420’, ‘Dude OG 420’ వంటి కోడ్ పేర్లతో రోజుకు 800 నుంచి 900 మందికి మత్తుపదార్థాలు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. అంతేకాదు, బ్యాంకు ఖాతాల ద్వారా దొరికిపోకుండా ఉండేందుకు ప్రధాన సూత్రధారి ఇద్రిస్, వినియోగదారుల నుంచి యూఎస్డీటీ, రెడిట్ వంటి క్రిప్టోకరెన్సీ రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
