YouTubers Journalists: డిజిటల్ యుగంలో చేతిలో స్మార్ట్‌ఫోన్, చిన్న మైక్ పట్టుకుని వీడియోలు చేసే ప్రతి ఒక్కరూ తమను తాము జర్నలిస్టులుగా చెప్పుకుంటున్న తరుణంలో, ఈ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, రీల్ మేకర్లు ఎప్పటికీ ప్రొఫెషనల్ జర్నలిస్టులతో సమానం కాలేరని ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. ఇటీవల ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల కవరేజీ సందర్భంగా జర్నలిస్టులపై పోలీసులు దాడులు, వేధింపులకు పాల్పడ్డారంటూ దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ పోలీసులు ఈ మేరకు అఫిడవిట్ సమర్పించారు.
కంటెంట్ క్రియేటర్లకు, జర్నలిస్టులకు మధ్య స్పష్టమైన గీత
వార్తాపత్రికలు, టీవీ ఛానెళ్లు, గుర్తింపు పొందిన వార్తా సంస్థల్లో బాధ్యతాయుతంగా పనిచేసే వృత్తిపరమైన జర్నలిస్టులకు.. కేవలం వ్యూస్, వాణిజ్య ప్రయోజనాల కోసం వీడియోలు రూపొందించే సోషల్ మీడియా క్రియేటర్లకు మధ్య చాలా తేడా ఉందని ఢిల్లీ పోలీసులు తమ అఫిడవిట్లో పేర్కొన్నారు. కెమెరా, మైక్రోఫోన్ పట్టుకున్నంత మాత్రాన వారందరినీ జర్నలిస్టులుగా పరిగణించలేమని, కంటెంట్ క్రియేటర్లకు పాత్రికేయ హోదా వర్తించదని తేల్చిచెప్పారు.
నకిలీ ఐడీలతో హల్చల్.. వీడియో ఆధారాలు సమర్పణ
అక్టోబర్‌లో జరిగిన నిరసనల సమయంలో జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మీడియా ప్రతినిధుల కవరేజీని తాము ఎక్కడా అడ్డుకోలేదని పోలీసులు వివరించారు. అక్రిడేషన్ కార్డులు లేకపోయినా నిజమైన జర్నలిస్టులకు అనుమతి ఇచ్చామన్నారు. అయితే, కొందరు వ్యక్తులు తప్పుడు గుర్తింపు కార్డులు, మైక్ లోగోలతో జర్నలిస్టులుగా చెలామణి అయ్యారని ఆరోపించారు. ఓ మహిళ ప్రెస్ కార్డుతో హడావుడి చేసినా, విచారణలో తాను జర్నలిస్టును కాదని అంగీకరించిన విషయాన్ని, అలాగే మరికొందరు యూట్యూబర్లు కేవలం కంటెంట్ కోసం ఉద్దేశపూర్వకంగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియోలను కోర్టు ముందుంచారు.
శాంతిభద్రతల కోసమే ఆంక్షలు
జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని తాము ఎలాంటి చర్యలు తీసుకోలేదని, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే నిరసన ప్రాంతాల్లో ఆంక్షలు విధించామని పోలీసులు తెలిపారు. పొరపాటున ఎవరైనా అదుపులోకి వచ్చినా, వారి గుర్తింపు నిర్ధారించుకుని వెంటనే విడిచిపెట్టామని పేర్కొన్నారు. మొత్తంమీద యూట్యూబర్లు వర్సెస్ జర్నలిస్టుల గుర్తింపుపై ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఈ అఫిడవిట్ ఇప్పుడు మీడియా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
