Amaravati ORR: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో అత్యంత కీలకమైన ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణానికి అడుగులు పడ్డాయి. దాదాపు 195.13 కిలోమీటర్ల పొడవుతో, 6 లేన్ల రహదారి నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) టెండర్లను ఆహ్వానించింది. రూ. 15,116.45 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం 2027 జనవరి 15 వరకు బిడ్లు దాఖలు చేయవచ్చు. జనవరి 18న టెండర్లను తెరవనున్నారు.
రెండు ప్యాకేజీలు.. భారీ ప్రణాళిక:
ఈ మెగా ప్రాజెక్టును NHAI రెండు ప్యాకేజీలుగా విభజించింది. మొదటి ప్యాకేజీ కింద కంచికచర్ల–ఆగిరిపల్లి–ఉయ్యూరు మధ్య 87.63 కిలోమీటర్లు, రెండో ప్యాకేజీ కింద ఉయ్యూరు–గుంటూరు–కంచికచర్ల వరకు (గుంటూరు–నారాకోడూరు 4-లేన్ స్పర్ రోడ్డుతో కలిపి) 107.50 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఒకేసారి మొత్తం 195 కిలోమీటర్లకు బిడ్డింగ్ పిలవడం ప్రాజెక్టు పట్ల ఉన్న చిత్తశుద్ధిని సూచిస్తోంది.
హైదరాబాద్, బెంగళూరుతో పోలిస్తే ఎంతో పెద్దది!
దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాల రింగ్ రోడ్లతో పోలిస్తే అమరావతి ORR ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ ORR 158 కిలోమీటర్లు (8 లేన్లు) ఉండగా, అమరావతి రింగ్ రోడ్డు దానికంటే 37 కిలోమీటర్లు పెద్దది. ఇక చెన్నై పెరిఫెరల్ రింగ్ రోడ్డు 133 కిలోమీటర్లు కాగా, బెంగళూరు బిజినెస్ కారిడార్ (పాత PRR) కేవలం 73.5 కిలోమీటర్లు మాత్రమే. బెంగళూరులో నగర అవసరాలకు ఒక రింగ్, దూర ప్రాంతాలకు 280 కిలోమీటర్ల శాటిలైట్ రింగ్ (STRR) అని రెండు నిర్మించారు. కానీ అమరావతిలో ఈ రెండింటి ప్రయోజనాలను ఒకే రింగ్ రోడ్డు అందించేలా రూపొందించారు.
అసలైన పరీక్ష ‘నిర్మాణ వేగమే’!
నగరంలోకి వచ్చే భారీ వాహనాలను బయటి నుంచే మళ్లించే బైపాస్గా, రేడియల్ రోడ్ల ద్వారా రాజధానికి ఎంట్రీ గేట్గా ఈ ORR పనిచేయనుంది. అయితే, ప్రణాళికలు ఎంత గొప్పగా ఉన్నా వాటి అమలే అసలైన విజయాన్ని నిర్ణయిస్తుంది. 2001లో ఆలోచన మొదలైన హైదరాబాద్ ORR, దశలవారీగా పూర్తి కావడానికి పదేళ్లు (2004–2014) పట్టింది. 2007లో ప్రతిపాదించిన బెంగళూరు PRR, భూసేకరణ జాప్యం వల్ల దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడే కదులుతోంది. ఫలితంగా దాని ఖర్చు రూ. 7 వేల కోట్ల నుంచి రూ. 10,500 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో భూసేకరణను వేగంగా పూర్తి చేసి, నిర్ణీత గడువులోగా అమరావతి ORRను పట్టాలెక్కించడమే పాలకుల ముందున్న అసలైన సవాల్.
