Journalist Sites: ప్రజా సమస్యలపై దశాబ్దాలుగా కలం యుద్ధం చేస్తున్న సీనియర్ పాత్రికేయులకు కనీసం గజం జాగా దక్కకపోవడం, ఇప్పటికే ప్రభుత్వ స్థలాలు పొందినవారే మళ్లీ అదే ప్రయోజనం కోసం జాబితాల్లో చేరడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారంలో జరుగుతున్న అన్యాయంపై ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ (పీడీఎంఏ) అధ్యక్షుడు ఎస్.బి.ఎన్. చారి, న్యూస్ పేపర్స్ ఎడిటర్స్ రైట్స్ అసోసియేషన్ (నెరా) అధ్యక్షుడు కట్టా సత్యనారాయణ ప్రభుత్వాన్ని నిలదీశారు. అసలైన జర్నలిస్టులెవరో తేల్చకుండా స్థలాల పంపిణీకి సిద్ధమైతే, అర్హులైన సీనియర్లకు తీరని అన్యాయం జరుగుతుందని వారు హెచ్చరించారు.
ఒకరికి రెండు చోట్లా.. మరొకరికి గజం కూడా లేదా?
ఎల్బీనగర్ పరిధిలో గతంలోనే ప్రభుత్వాల ద్వారా ఇళ్ల స్థలాలు పొందిన కొందరు, తమ కుటుంబ సభ్యుల పేర్లతోనో లేదా పలుకుబడితోనో తిరిగి కొత్త జాబితాల్లోకి ఎలా వస్తున్నారని చారి, సత్యనారాయణ ప్రశ్నించారు. ఒకసారి సంక్షేమ ఫలాలు పొందిన వారికే మళ్లీ అవకాశం ఇస్తూ, ఏళ్ల తరబడి జర్నలిజాన్నే నమ్ముకుని పనిచేస్తున్న సీనియర్లను విస్మరించడం ఏమిటని నిలదీశారు. గతంలో స్థలాలు పొందిన వారి ఉత్తర్వులు, పూర్తి రికార్డులను బహిర్గతం చేసి, ఇప్పటివరకు ఒక్కసారి కూడా లబ్ధి పొందని నిజమైన జర్నలిస్టుల జాబితాను వేరుగా రూపొందించాలని డిమాండ్ చేశారు.
ఆధిపత్య పోరులో బలవుతున్న అర్హులు
జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన సంఘాలు ఎల్బీనగర్లో రెండు వర్గాలుగా విడిపోయి ఆధిపత్య పోరు సాగించడం వల్ల అసలైన పాత్రికేయులు నష్టపోతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సిఫారసులు, పరిచయాలతో కాకుండా వార్తా సేకరణ, అనుభవం, చట్టబద్ధమైన సంస్థల గుర్తింపు ఆధారంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులను గుర్తించాలన్నారు.
విజిలెన్స్ విచారణ, మీడియా కమిషన్ తప్పనిసరి
ఎల్బీనగర్లో గత, ప్రస్తుత ఇళ్ల స్థలాల జాబితాలపై తక్షణమే విజిలెన్స్ విచారణ జరిపి అక్రమాలను అరికట్టాలని కోరారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల గుర్తింపు, అక్రిడేషన్, సంక్షేమ పథకాల ప్రక్షాళన కోసం సీనియర్ జర్నలిస్టులు, న్యాయ నిపుణులతో కూడిన ప్రత్యేక ‘మీడియా కమిషన్’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముందుగా నిజమైన జర్నలిస్టులెవరో తేల్చిన తర్వాతే స్థలాలు కేటాయించాలని స్పష్టం చేశారు.
