ఒకనాటి ఫ్యాక్టరీ సందడి.. నేటి వ్యాపారాల హడావిడి.. ఇదీ మన ‘సిరీస్ రోడ్డు’ కథ!

LB Nagar

LB Nagar

LB Nagar: కొన్ని రహదారులు కేవలం సిమెంట్, తారుతో నిర్మించిన బాటలు మాత్రమే కావు.. అవి కొన్ని తరాల జ్ఞాపకాలకు, కన్నీళ్లకు, ఆనందాలకు, ఆశయాలకు సజీవ సాక్ష్యాలు. ఎల్బీ నగర్ నడిబొడ్డున అటు విజయవాడ జాతీయ రహదారిని, ఇటు కామినేని రోడ్డును అనుసంధానించే ‘సిరీస్ రోడ్డు’ కూడా సరిగ్గా అలాంటిదే! ఒకనాడు ఉదయపు సూర్యకిరణాలతో, ప్రశాంతమైన వాతావరణంలో అప్పుడప్పుడు కదిలే వాహనాలతో కనిపించిన ఈ దారి.. నేడు ఎల్బీ నగర్ అభివృద్ధికి ప్రధాన వారధిగా, అత్యంత రద్దీగా మారిన వాణిజ్య కేంద్రంగా రూపాంతరం చెందింది.

సిరీస్ రోడ్డు.. శ్రమజీవుల జీవనరేఖ

ఈ రోడ్డుకు ‘సిరీస్ రోడ్డు’ అనే పేరు రావడం వెనుక వేలాది మంది కార్మికుల చెమట చుక్కల చరిత్ర ఉంది. నేడు భారీ నివాస సముదాయం ‘వాసవీ ఆనంద నిలయం’ కొలువుదీరిన చోట, ఒకప్పుడు ‘సిరీస్’ (SIRIS) అనే పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ ఉండేది. ఆ కర్మాగారంలో దాదాపు మూడు నుంచి నాలుగు వేల మంది కార్మికులు పనిచేసేవారు. పొట్టకూటి కోసం ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చిన ఆ శ్రామికుల్లో అత్యధికులు ఫ్యాక్టరీకి ఎదురుగా ఉన్న ఈ రహదారికి ఇరువైపులా నివాసం ఉండేవారు. నిత్యం కార్మికుల సందడితో కళకళలాడుతూ, ఆ నోటా ఈ నోటా నాని, కాలక్రమేణా ఈ దారి ‘సిరీస్ రోడ్డు’గా అందరి గుండెల్లో స్థిరపడిపోయింది.

జ్ఞాపకాల దొంతరలు.. బతుకుదెరువు బాటలు

సిరీస్ రోడ్డు అంటే ఎందరో స్థానికులకు ఒక మధురమైన భావోద్వేగం. ఇక్కడి న్యూ తక్షశిలా హైస్కూల్, శాంతినికేతన్ స్కూల్ వేలాది మంది విద్యార్థులకు అక్షర భిక్ష పెట్టి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశాయి. గణేశ్ బాటిల్స్ కంపెనీ, శ్రీ వెంకటేశ్వర కిరాణా జనరల్ స్టోర్, పాత గోడౌన్లు, ఎన్నో శుభకార్యాలకు వేదికైన శ్రీరాల ఫంక్షన్ హాల్.. ఇలా అడుగడుగునా పాత జ్ఞాపకాల గుర్తులు నేటికీ పలకరిస్తుంటాయి.

కాలం మారేకొద్దీ ఈ రోడ్డు స్వరూపం మారింది. నేడు విద్యాసంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, హోటళ్లు, చిన్నాచితకా వ్యాపారాలతో సిరీస్ రోడ్డు నిత్యం కిటకిటలాడుతూ వేలాది కుటుంబాలకు జీవనోపాధిని కల్పిస్తోంది. సుమారు మూడు దశాబ్దాల క్రితమే విస్తరణ కోసం కొలతలు వేసిన ఈ రహదారి, త్వరలోనే మరింత విశాలంగా మారబోతోంది. రూపం ఎంత మారినా, సిరీస్ రోడ్డు మాత్రం ఎల్బీ నగర్ వాసుల ఆత్మగౌరవానికి, అనుబంధానికి ఎప్పటికీ ఒక సజీవ చిరునామా!