రూ. 9.5 లక్షల కారు నచ్చలేదంట.. బ్రెజా కోసం పీటల మీదే పెళ్లికి నో చెప్పిన వరుడు!

Dowry Demand

Dowry Demand

Dowry Demand:  వరకట్న దాహం ఒక పెళ్లిని పీటల మీదే ఆపేసింది. కట్నంగా కోరిన ఖరీదైన కారు ఇవ్వలేదని ఓ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ చివరి నిమిషంలో వివాహాన్ని రద్దు చేసుకున్న ఘటన హర్యానాలోని సోనిపట్‌లో కలకలం రేపింది. సోనిపట్‌కు చెందిన సుభాష్ కుమార్ తన కుమార్తె హీనాకు, ఢిల్లీ పోలీస్ విభాగంలో పనిచేస్తున్న కుల్దీప్‌తో ఆరు నెలల క్రితం వివాహం నిశ్చయించారు.

ఒక్కరోజు ముందు మారిన డిమాండ్:

ఈ నెల 20న పెళ్లి జరగాల్సి ఉండగా, వరుడి కుటుంబం కారు, బంగారు ఆభరణాలు కావాలని డిమాండ్ చేసింది. వధువు కుటుంబం ఇప్పటికే సుమారు రూ. 9.5 లక్షల విలువైన హ్యుందాయ్ ఆరా కారును బుక్ చేసింది. అయితే, పెళ్లికి ఒక్కరోజు ముందు తనకు రూ. 13 లక్షల విలువైన మారుతి బ్రెజా కారు కావాలని వరుడు పట్టుబట్టాడు.

బంధువులు నచ్చజెప్పినా వినకుండా..

పెళ్లి రోజున బ్రెజా కారు ఏర్పాటు చేయలేకపోవడంతో వరుడు వివాహానికి నిరాకరించాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వరుడు తమ సోదరుడితో గొడవకు దిగినట్లు బాధిత కుటుంబం ఆరోపించింది. బంధువులు ఎంతగా నచ్చజెప్పినా వినకుండా వరుడు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వధువు కుటుంబం కన్నీరుమున్నీరైంది.