పాల్గొన్న A.V.G ఫౌండేషన్ చైర్మన్ ఆడాల వరలక్ష్మి-గణేష్
మినిట్2మినిట్ డెస్క్, యాచారం: మండలంలోని మేడిపల్లి నక్కర్త గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. A.V.G ఫౌండేషన్ చైర్మన్ ఆడాల వరలక్ష్మి–గణేష్ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉదయం స్వామివారికి పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకం, అర్చనలు నిర్వహించి ప్రార్థనలు చేశారు. అనంతరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వైదిక పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య వైభవంగా నిర్వహించారు. కార్యక్రమం అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా A.V.G ఫౌండేషన్ చైర్మన్ ఆడాల గణేష్ మాట్లాడుతూ.. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహంతో గ్రామ ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. సమాజంలో భక్తి, ఆధ్యాత్మిక చింతనతో పాటు ప్రజల మధ్య సామాజిక ఐక్యతను పెంపొందించేందుకు ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
