గదమాయించడమూ నేరమేనా?
నెట్టింట వైరలవుతున్న ‘ప్రీ-స్కూల్ రచ్చ’
అమ్మనాన్నల అతి ప్రేమ… ఉపాధ్యాయులకు ఉరితాడుగా మారుతోందా?
బడిలో గొంతు పెంచితే ‘కేసు’… మరి పిల్లలకు క్రమశిక్షణ నేర్పేది ఎలా?
సోషల్ మీడియాలో లీగల్ పోరాటాలు… బోనులో ఉపాధ్యాయ వ్యవస్థ!
మినిట్ 2 మినిట్, ట్రెండింగ్ టాపిక్: ‘పిల్లలను ప్రేమగా పెంచడం వేరు… వారి తప్పులను కప్పిపుచ్చుతూ, సరిదిద్దే గురువుపైనే తిరగబడటం వేరు. తల్లిదండ్రులు ఈ వ్యత్యాసాన్ని గుర్తించాలి! హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ ప్రీ-స్కూల్‌లో మూడున్నరేళ్ల చిన్నారికి ఎదురైన అనుభవంపై ఆమె తల్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు, చేస్తున్న రచ్చ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి. పసిపాపపై ఉపాధ్యాయురాలు చేయి చేసుకున్నారంటూ పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించడం, న్యాయం కావాలంటూ డిమాండ్ చేయడంపై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు పిల్లల భద్రత ప్రాధాన్యమనే మాట వినిపిస్తున్నా, మరోవైపు చిన్న చిన్న విషయాలకే తల్లిదండ్రులు ఇంతలా అతిగా స్పందించడం, సోషల్ మీడియాలో రచ్చ చేయడం ఎంతవరకు సమంజసమనే కొత్త చర్చ మొదలైంది. మూడు, నాలుగేళ్ల వయసున్న పిల్లలకు ఏది మంచి, ఏది చెడు అనే పరిపక్వత ఉండదు. తరగతి గదిలో అల్లరి చేసినప్పుడో, చెప్పింది సరిగ్గా రాయనప్పుడో, ప్రమాదకరమైన పనులు చేయబోయినప్పుడో ఉపాధ్యాయులు కొద్దిగా గొంతు పెంచి గదమాయించడం లేదా మందలించడం సహజమైన ప్రక్రియ. ప్రతీ చిన్న దానికి పిల్లలను బతిమాలుతూ కూర్చుంటే క్రమశిక్షణ అలవడటం అసాధ్యం. గురువు గదమాయించడాన్ని కూడా ‘దాడి’ లేదా ‘హింస’ అని చిత్రీకరిస్తూ, విచారణ లేకుండానే ఇన్ స్టాగ్రామ్‌లో లైవ్‌లు పెట్టడం వల్ల ఉపాధ్యాయ వ్యవస్థ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతోంది.
సోషల్ మీడియా పబ్లిసిటీ… పరిష్కారమా?
ఏదైనా తప్పు జరిగితే స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయవచ్చు, లేదా చట్టపరమైన మార్గాలు ఉన్నాయి. కానీ, ఇన్ స్టాగ్రామ్‌లో, సోషల్ మీడియాలో రచ్చ చేయడం వల్ల ఆ పాఠశాలలోని ఇతర విద్యార్థులపై, టీచర్ల మనోధైర్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. గురువులను సమాజంలో విలన్లుగా చిత్రీకరిస్తే… భవిష్యత్తులో పిల్లలకు గురువుల పట్ల గౌరవం ఎలా పెరుగుతుంది? సమస్య ఏదైనా సోషల్ మీడియా వేదికగా విద్యాసంస్థల ప్రతిష్టను, గురువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే… భవిష్యత్తులో టీచర్లు “మనకెందుకులే వచ్చిన గొడవ” అని పిల్లల ప్రవర్తనను పట్టించుకోవడం మానేసే ప్రమాదం ఉంది. పిల్లలపై అతి ప్రేమ మంచిది కాదు. బడికి పంపిన తర్వాత గురువులకు కొంత వెసులుబాటు, అధికారం ఇవ్వాల్సిందే. ప్రతీ చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ, తల్లిదండ్రులు తమ అతి ప్రేమతో గురువుల చేతులను కట్టేస్తే, రేపు మన పిల్లలకు సన్మార్గం చూపించే ధైర్యం ఏ ఉపాధ్యాయుడూ చేయలేడు. పరిమితులు దాటని ప్రేమ, హద్దులు దాటని ఆందోళన మాత్రమే పిల్లల భవిష్యత్తుకు శ్రీరామరక్ష.
