తిరుమలలో అపచారంపై టీటీడీ ఆగ్రహం
అలిపిరి నడకమార్గంలో ధూమపానంపై చర్యలు
బాధ్యుడిపై చట్టపర చర్యలకు ఆదేశం
తనిఖీల్లో నిర్లక్ష్యం వహించిన సెక్యూరిటీపై విచారణ
మినిట్ 2 మినిట్, తిరుమల(ఆగస్ట్ 17): తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అలిపిరి నడకమార్గంలో సిగరెట్ తాగిన వ్యక్తి ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీవ్రంగా స్పందించింది. సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యల కోసం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
తిరుమల కొండతో పాటు అలిపిరి, శ్రీవారి మెట్టు నడకదారులు, ఆలయ పరిసర ప్రాంతాల్లో ధూమపానం, మద్యం, గుట్కా వంటి మత్తు పదార్థాల వినియోగం పూర్తిగా నిషేధం. పవిత్రమైన పుణ్యక్షేత్ర నడకమార్గంలో నిబంధనలు ఉల్లంఘించి బహిరంగంగా సిగరెట్ తాగడాన్ని పాలకమండలి తీవ్రంగా ఖండించింది. ఈ అపచారానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని తెలిపింది. ప్రవేశ మార్గాల వద్ద భక్తుల తనిఖీల్లో నిర్లక్ష్యం వహించిన సెక్యూరిటీ సిబ్బందిపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తిరుమల పవిత్రతను కాపాడేందుకు భక్తులందరూ సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
