‘అన్నయ్య’ అనే ఒక్క పలకరింపు కోసం..!
తమ్ముడి ఆప్యాయత కోసం ఎదురుచూస్తున్న బ్రహ్మానందం సోదరుడు
“ఏరా అన్నయ్యా.. ఎలా ఉన్నావ్?” అని అడిగితే చాలు
తోడబుట్టిన వారి అనుబంధంపై శ్రీవదన్ భావోద్వేగం
నెట్టింట వైరలవుతున్న హాస్యబ్రహ్మ సోదరుడి ఆవేదన
మినిట్ 2 మినిట్, హైదరాబాద్ (ఆగస్ట్ 20): వెండితెరపై కోట్లాది మందికి హాయిగా నవ్వులు పంచే హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఇంట్లో ఒకింత భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఆయన సొంత అన్నయ్య శ్రీవదన్ వృద్ధాప్యంలో తమ్ముడి నుంచి లభించే చిన్న పలకరింపు కోసం ఎంతగానో ఆరాటపడుతున్నారు. “మేం ఆరుగురం సంతానం, వారిలో నలుగురు చనిపోయారు. ఉన్నది మేమిద్దరమే. కానీ ఇక్కడ నేను ఒంటరిగా మిగిలిపోయాను” అంటూ ఆయన వ్యక్తం చేసిన ఆవేదన ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మనస్సును పిండేస్తోంది.
ఇటీవల తమ్ముడు సొంత ఊరికి వచ్చి కనీసం పలకరించకుండా వెళ్లిపోయారని, ఎప్పుడైనా ఫోన్ చేసి “ఏరా అన్నయ్యా.. ఎలా ఉన్నావ్?” అని అడుగుతాడేమోనని ఆశగా ఎదురుచూస్తున్నానని శ్రీవదన్ పేర్కొన్నారు. హోదాలో ఉన్నవారు లేదా గొప్ప స్థాయిలోని వ్యక్తులు వచ్చి చిన్నవారిని ఆప్యాయంగా పలకరిస్తే వచ్చే సంతోషం మాటల్లో చెప్పలేనిదని అభిప్రాయపడ్డారు. తనకు తమ్ముడి నుంచి ఎలాంటి ఆస్తులు లేదా డబ్బులు వద్దని, కేవలం అభిమానంతో కూడిన ఆ ఒక్క ఫోన్ కాల్ వస్తే చాలని కన్నీటి పర్యంతమయ్యారు.
అదే సమయంలో, గతంలో తమ కుటుంబానికి బ్రహ్మానందం చేసిన ఆర్థిక సహాయాలను, ముగ్గురు కుమార్తెల పెళ్లిళ్లు చేసి ఇల్లు కట్టించి ఇచ్చిన విషయాన్ని కూడా శ్రీవదన్ గుర్తుచేసుకున్నారు. అయితే, వృద్ధాప్యంలో సొత్తు కన్నా తోడబుట్టిన వారి ప్రేమ, ఆప్యాయమైన పలకరింపు మాత్రమే కొండంత కొండంత బలాన్నిస్తుందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
