‘ఇరుముడి’ విజయం పాన్ ఇండియా దర్శకులకు ఒక పాఠం
– ప్రముఖ నిర్మాత నట్టి కుమార్
మినిట్ 2 మినిట్ , మూవీ న్యూస్ : మాస్ రాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న అద్భుత విజయంపై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ ప్రశంసలు వర్షించారు. ఈ సినిమా కలెక్షన్స్ నమ్మశక్యం కాని రీతిలో ఉన్నాయని, సినిమా చరిత్రలో ఇలాంటి జనసందోహాన్ని చూడటం చాలా అరుదని ఆయన కొనియాడారు. C సెంటర్ల నుంచి ప్రధాన నగరాల వరకు అన్ని థియేటర్లు హౌస్‌ఫుల్ కావడం విశేషమన్నారు.
ఒకప్పుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో విజయశాంతి నటించిన ‘ఓసే రాములమ్మ’ సినిమాకు జనాలు ఎడ్ల బండ్లు కట్టుకుని వచ్చి, రాత్రిళ్లు థియేటర్ల వద్ద కాపలా కాసి మరీ చూసేవారని, మళ్లీ ఇన్నాళ్లకు ‘ఇరుముడి’ చిత్రానికి థియేటర్ల వద్ద అదే స్థాయి ఉత్సాహం, జనసందోహం కనిపిస్తోందని తెలిపారు. కుటుంబ సమేతంగా ప్రేక్షకులు తరలిరావడంతో థియేటర్లు కళకళలాడుతున్నాయని, కంటెంట్ బాగుంటే ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడం కష్టమేమీ కాదని ఈ సినిమా నిరూపించిందని అభిప్రాయపడ్డారు.
ఈ చిత్రం రూ.300 కోట్ల మార్క్‌ను దాటుతుందనే అంచనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నట్టి కుమార్ తెలిపారు. పెద్ద పెద్ద హీరోలు, మైండ్ బ్లాకింగ్ బడ్జెట్లతో ‘పాన్ ఇండియా’ అనే మోజులో పడి అసలు కథను, సినిమా ఆత్మను దెబ్బతీస్తున్న దర్శకులకు ‘ఇరుముడి’ ఒక మంచి పాఠమని స్పష్టం చేశారు. ప్రేక్షకులకు పాన్ ఇండియా ట్యాగ్‌తో పనిలేదని, సరైన కథ, ఆకట్టుకునే కంటెంట్ మాత్రమే కావాలని వ్యాఖ్యానించారు.
కంటెంట్ ఉంటే అదే అసలైన పాన్ ఇండియా అని నిరూపించిన హీరో రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు వై. రవిశంకర్, నవీన్ యెర్నేనితో పాటు చిత్ర బృందానికి ఆయన హృదయపూర్వక అభినందనలు, విజయ శుభాకాంక్షలు తెలియజేశారు.
