Rajahmundry : కంటతడి పెట్టిస్తున్న సౌజన్య లేఖ!

చావనివ్వడం లేదు.. బతకనివ్వడం లేదు!
ఒక తల్లి ఆఖరి కన్నీటి సంతకం!

నా భర్తకు విషమిచ్చాడు.. నా బిడ్డ ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టాడు
మతం మారమంటూ కొరడా దెబ్బలు, రక్తం ఓడుతున్న గాయాలు
వణుకుతున్న చేతులతో రాసిన మరణ వాఙ్మూలం ఇది!
సమాజమా ఇది ఓ తల్లి హెచ్చరిక
కంటతడి పెట్టిస్తున్న సౌజన్య లేఖ!

మినిట్ 2 మినిట్, స్పెషల్ డెస్క్(ఆగస్ట్ 25):   “నా పెన్ వణుకుతోంది.. గుండె పగిలిపోతోంది.. ఈ రాత్రికి మేం బతుకుతామో లేదో తెలియదు.. వాడు మా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. నన్ను, నా కడుపున పుట్టిన బిడ్డను, నా ముసలి తల్లిదండ్రులను బంధించి నరకం చూపిస్తున్నాడు!”.. ఇవి ఏ సినిమా కథలోని మాటలో కావు. ఒక అభాగ్యురాలైన తల్లి, తమ కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు ముందు లోకానికి వదిలివెళ్లిన చివరి కన్నీటి బొట్టు!

కాకినాడను పిడుగులా తాకిన ఆత్మహత్యల ఘటన వెనుక బయటపడ్డ కొవ్వూరి సౌజన్య లేఖ ప్రతి గుండెనూ పిండేస్తోంది. కష్టపడి చదువుకుని, సమాజంలో తండ్రి పేరు నిలబెట్టాలనుకున్న ఒక ఉన్నత కుటుంబానికి చెందిన కూతురు.. ఒక నీచుడి వలలో చిక్కుకుని అనుభవించిన ఘోర నరకానికి ఈ లేఖ సాక్ష్యంగా నిలిచింది. షూటింగ్ కోచ్‌గా పరిచయమై, ఆప్యాయత నటిస్తూ ఇంట్లోకి దూరి, చివరికి భర్త ప్రాణాలను విషమిచ్చి తీసేసి, బిడ్డ ప్రాణాన్ని అడ్డుపెట్టుకుని ఆస్తి మొత్తాన్ని గుంజేసిన ఒక క్రూరుడి అసలు రూపం ఇందులో బహిర్గతమైంది.

‘కృష్ణ పరమాత్ముడి సాక్షిగా.. నా ధర్మాన్ని వదల్లేదు!’

“నన్ను రోజు రోజుకీ కొడుతూ, ఇస్లాంలోకి మారమని, బుక్స్ రాయమని టార్చర్ పెట్టాడు. సముద్రంలో తోసేసి మళ్లీ లాగి రాళ్లపై పడేస్తానంటూ భయపెట్టాడు. నా భర్త చనిపోయాక నా చుట్టూ ఇనుప గోడలు కట్టేశాడు. బ్యాంక్ కీలు, ఇల్లు, చివరికి నా ఫోన్ కూడా వాడి కంట్రోల్ లోనే ఉంది” అంటూ ఆమె వర్ణించిన తీరు ఎవరికైనా ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఇన్ని బాధలు పెట్టినా ఆ తల్లి తన ధర్మాన్ని వీడలేదు. కృష్ణపరమాత్మ సాక్షిగా ప్రాణాలను తీసుకుంది కానీ, పరమతంలోకి వెళ్లలేదు.

తన బిడ్డ స్కూల్ వద్దకు వచ్చి కిడ్నాప్ చేస్తానని బెదిరిస్తుంటే, కనీసం పోలీసులకు చెప్పుకుందామన్నా డిపార్ట్‌మెంట్‌తో సంబంధాలున్నాయని భయపెడుతుంటే.. ఏమీ చేయలేని స్థితిలో ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ఇవాళ సమాజానికే ఒక గొడ్డలిపెట్టు. “అమ్మలారా.. మీ పిల్లల బలహీనతలను ఆసరాగా చేసుకునే సాధిక్ లాంటి పాములు ఉంటారు.. జాగ్రత్త!” అని ఆమె ఇచ్చిన చివరి హెచ్చరిక ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.

‘‘సాధిక్.. నరరూప రాక్షసత్వానికి ఐదు ప్రాణాలు బలైపోయాయి. ఆ వణికిన చేతుల లేఖకు, ఆ కుటుంబపు కన్నీళ్లకు న్యాయం జరగాల్సిందే! నిందితుడిని కఠినంగా శిక్షించే వరకు బాధితుల పక్షాన పోరాడుతూనే ఉంటాం’’ అని పలువురు తెలిపారు!