ఈ దేశం సొమ్ము దుబాయ్ తరలిపోతోంది!
భారత కుబేరులకు ‘సెకండ్ హోమ్’గా యూఏఈ
సంపన్నుల చూపు గల్ఫ్ వైపే..
కారణం పన్ను రహిత ఆదాయం, గోల్డెన్ వీసా?
సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల భారీ పెట్టుబడులు!
మినిట్ 2 మినిట్, హైదరాబాద్ (ఆగస్ట్ 26 ): భారత పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో సరికొత్త చర్చ మొదలైంది. దేశంలోని అగ్రశ్రేణి సంపన్నులు, సినీ నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు తమ వద్ద ఉన్న పెట్టుబడుల్లో పెద్ద మొత్తాన్ని దుబాయ్ రియల్ ఎస్టేట్, వ్యాపార రంగానికి తరలిస్తున్నారు. ‘హై నెట్ వర్త్ ఇండివిజువల్స్’ (HNWI) లో గణనీయమైన శాతం మంది దుబాయ్‌ను తమ రెండవ నివాస స్థావరంగా ఎంచుకుంటుండటంతో, భారత సంపద విదేశీ గడ్డపైకి మళ్లుతోందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
దుబాయ్ ఆకర్షించడానికి ప్రధానంగా అక్కడ అమలులో ఉన్న సున్నా పన్ను విధానం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన జీవనశైలి ముఖ్య కారణాలుగా నిలుస్తున్నాయి. దీనికి తోడు రూ. 4.5 కోట్లు విలువైన ఆస్తి కొనుగోలు చేస్తే ప్రభుత్వం ఇచ్చే 10 ఏళ్ల ‘గోల్డెన్ వీసా’ ధనవంతులకు మరింత సులభమైన మార్గంగా మారింది. వ్యాపార అనుకూల నిబంధనలు, అత్యున్నత భద్రత, సులభమైన అంతర్జాతీయ కనెక్టివిటీ ఉండటంతో వ్యాపారవేత్తలు దుబాయ్‌ని సేఫ్ హెవెన్ (రక్షిత ప్రాంతం)గా భావిస్తున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, బెంగళూరు నగరాలకు చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, సినీ సెలబ్రిటీలు పామ్ జుమేరా, బిజినెస్ బే వంటి విలాసవంతమైన ప్రాంతాలలో కోట్ల రూపాయల విలువైన విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. దేశీయంగా పెట్టుబడులపై నిఘా పెరగడం, పన్నుల భారం ఎక్కువ కావడం వల్ల కూడా ధనవంతులు తమ మూలధనాన్ని సురక్షిత విదేశీ మార్కెట్లలో పెట్టుబడిగా పెడుతున్నారు. దేశీ సంపద ఇలా విదేశీ స్థిరాస్తి వ్యాపారానికి రెక్కలుగా మారడంపై ఆర్థిక నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
