తెలిసే చేశారు!
రాజీవ్‌కు లోపం ఉందని వాళ్లకు తెలుసు!
మాజీ మంత్రి జోగి పెద్ద కోడలు మేఘన సంచలన ఆరోపణలు
శారీరక, మానసిక వేధింపులకు గురిచేశారని కన్నీటి పర్యంతం
న్యాయం కోసం సజ్జలను కలిసినా స్పందించలేదని ఆవేదన
మినిట్ 2 మినిట్, విజయవాడ (ఆగస్ట్ 26): వైఎస్సార్సీపీ నేత, ఏపీ మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర కలకలం రేపుతోంది. జోగి రమేశ్ కుటుంబ సభ్యుల తీరుపై ఆయన పెద్ద కోడలు మేఘన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియా ముందే కన్నీటి పర్యంతమయ్యారు. సూర్యాపేటకు చెందిన తనతో జోగి రమేశ్ కుమారుడు రాజీవ్‌కు 2025 మే నెలలో వివాహమైందని, అయితే తనకు జరిగిన తీవ్ర అన్యాయాన్ని సమాజానికి తెలియజేసేందుకే ధైర్యం చేసి మీడియా ముందుకు వచ్చానని ఆమె తెలిపారు.
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోవడం సాధారణమే అయినప్పటికీ, తన భర్త రాజీవ్‌కు ఉన్న తీవ్రమైన శారీరక లోపం గురించి ఆయన కుటుంబ సభ్యులందరికీ ముందే తెలుసని మేఘన ఆరోపించారు. నిజాలన్నీ దాచి, అంతా తెలిసీ తన సంతోషాన్ని, జీవితాన్ని నాశనం చేశారని వాపోయారు. “జోగి రమేశ్‌కు కూడా ఒక కూతురుంది, ఆమెకు ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఊరుకుంటారా? తీవ్రమైన లోపం ఉందని తెలిసీ నాతో ఎలా పెళ్లి చేశారో జోగి రమేశ్ సమాధానం చెప్పాలి” అని తీవ్రస్థాయిలో నిలదీశారు.
పెళ్లైన కొద్ది రోజులకే తనపై భౌతిక, మానసిక వేధింపులు మొదలయ్యాయని, ఈ విషయాలన్నింటినీ పోలీసులకు ఇచ్చిన ఎఫ్ఐఆర్లో స్పష్టంగా పేర్కొన్నట్లు వెల్లడించారు. ఈ అన్యాయంపై తమ కుటుంబం వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి వివరించినా ఆయన కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కుటుంబ వేధింపులపై గళమెత్తిన మేఘన, తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబానికి రాజకీయంగా, వ్యక్తిగతంగా తీవ్ర ఇబ్బందికరంగా మారాయి.
