కొండగట్టు: సిరిసిల్ల నేతన్నల హస్తకళా నైపుణ్యం మహాగొప్పది అనడానికి ఇది మరో సజీవ సాక్ష్యం! రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత విద్వాంసుడు వెల్ది హరిప్రసాద్ తన మాయాజాలాన్ని మరోసారి ప్రదర్శించారు. ఒక సాధారణ అగ్గిపెట్టెలో సులభంగా ఇమిడిపోయేంత అతి సూక్ష్మమైన, అత్యంత అద్భుతమైన పట్టు శాలువాను ఆయన తన స్వహస్తాలతో నేశారు. ఈ అపురూప కళాఖండాన్ని జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారికి అత్యంత భక్తిశ్రద్ధలతో కానుకగా సమర్పించారు.
ఈ శాలువా తయారీ వెనుక హరిప్రసాద్ గారి శ్రమ, ప్రతిభ అసాధారణమైనవి. అత్యంత సన్నని పట్టు దారాలను ఉపయోగించి, ఎంతో ఏకాగ్రతతో ఈ శాలువాను రూపొందించారు. సైజులో చాలా చిన్నదిగా అనిపించినప్పటికీ… దాన్ని నేసిన తీరు, ఉపయోగించిన సాంకేతికత, ఆ కూతక నైపుణ్యం చూస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే! సిరిసిల్ల నేతన్నల ప్రతిభకు ఈ శాలువా నిదర్శనంగా నిలిచింది. కొండగట్టు ఆలయానికి చేరుకున్న హరిప్రసాద్.. స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తానే స్వయంగా నేసిన ఈ అగ్గిపెట్టె పట్టు శాలువాను ఆలయ అధికారులకు బహూకరించారు. ఒక చిన్న అగ్గిపెట్టెలోంచి అంత పెద్ద శాలువా బయటకు తీస్తుంటే అక్కడున్న భక్తులు, ఆలయ అధికారులు ఆశ్చర్యంతో అబ్బురపడ్డారు. హరిప్రసాద్ అసాధారణ ప్రతిభను, ఆయన భక్తిని ఆలయ వర్గాలు ముక్తకంఠంతో కొనియాడాయి. గతంలోనూ సిరిసిల్ల నేతన్నలు అగ్గిపెట్టెలో పట్టే చీరలు, ఉంగరంలోంచి దూరిపోయే అద్భుతాలను సృష్టించగా… ఇప్పుడు హరిప్రసాద్ అంజన్నకు సమర్పించిన ఈ శాలువా సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారుతోంది.
