మీకు తెలుసా? ఈ రోజుల్లో మనం ఓటీటీలలో ఎన్నో చారిత్రాత్మక సిరీస్‌లు చూస్తున్నాం. కానీ, 1990ల కాలంలోనే టెలివిజన్ హిస్టరీని తిరగరాసిన ఒక అద్భుత దృశ్యకావ్యం ఉంది. అదే దూరదర్శన్‌లో ప్రసారమైన ‘చాణక్య’ సీరియల్. అయితే, ఈ సీరియల్‌ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాన్ చేసిందంటూ సోషల్ మీడియాలో తరచూ ఒక వార్త చెక్కర్లు కొడుతుంటుంది. నేటి తరం యువతలో చాలామంది దీన్ని నిజమే అని నమ్ముతున్నారు. కానీ, ఇందులో అస్సలు నిజం లేదు!
అసలు కథ ఏంటి?
డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ అండ్ హిస్టారికల్ డ్రామా 8 సెప్టెంబర్ 1991 నుండి 9 ఆగస్టు 1992 వరకు దూరదర్శన్‌లో విజయవంతంగా టెలికాస్ట్ అయ్యింది. అప్పట్లో పి.వి. నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రారంభంలో దూరదర్శన్ కేవలం 26 ఎపిసోడ్లకే అనుమతి ఇచ్చింది. కానీ, ఈ సీరియల్‌కు వచ్చిన క్రేజ్, నాణ్యత చూసి ప్రభుత్వమే మరో 21 ఎపిసోడ్ల పొడిగింపును (Extension) మంజూరు చేసింది. అలా మొత్తం 47 ఎపిసోడ్లు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తిస్థాయిలో ప్రసారమయ్యాయి.
మరి వివాదం ఎందుకు వచ్చింది?
ఆ కాలంలో దేశంలో రామజన్మభూమి ఉద్యమం వంటి రాజకీయ పరిస్థితులు నడుస్తున్నాయి. ఆ సమయంలో సీరియల్లో వాడిన కాషాయ జెండాలు, ‘హర హర మహాదేవ్’ నినాదాలు, అఖండ భారత్ అనే సంభాషణలపై కొందరు కమ్యూనిస్ట్ మేధావులు, రాజకీయ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి మతపరమైన రంగు పులిమి, ప్రసారాలు ఆపాలని దూరదర్శన్పై ఒత్తిడి తెచ్చారు.
ఈ వివాదాల వల్లే జనాల్లో “ఈ సీరియల్ బ్యాన్ అయ్యింది” అనే తప్పుడు అభిప్రాయం ఉండిపోయింది. ప్రభుత్వ వ్యతిరేక ఒత్తిడిని సైతం తట్టుకుని దూరదర్శన్ దీన్ని విజయవంతంగా ముగించింది. చివరికి, 2020 లాక్డౌన్ సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ఐకానిక్ సీరియల్‌ను దూరదర్శన్ (DD Bharti) లో మళ్లీ రీ-టెలికాస్ట్ చేసిందంటేనే అర్థం చేసుకోవచ్చు… ఇది ఎప్పుడూ బ్యాన్ కాలేదని! పుకార్లను నమ్మేముందు నిజానిజాలు తెలుసుకోవడం మన బాధ్యత.
