మినిట్2మినిట్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖమ్మం ‘రైతు ఆశీర్వాద సభ’ను సీఎం దూషణ సభగా మార్చారని, భద్రాద్రి రాముడిపై అపవిత్ర వ్యాఖ్యలు చేస్తూ హిందువుల మనోభావాలను గాయపరిచారని మండిపడ్డారు. కాలాతీతుడైన శ్రీరాముడిని అవమానించినందుకు రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల తేదీలపై రేవంత్ ముందే జోస్యాలు చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని, ఆయన కాంగ్రెస్ సీఎంలా కాకుండా మోదీ-అమిత్ షాల సిద్ధాంతాలను అమలు చేస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల వల్ల రేవంత్ పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు.
సాంకేతిక అజ్ఞానంతో మేడిగడ్డపై సీఎం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. బ్యారేజీ గేట్లు మూయకుండానే నీటిని లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా, కేవలం రెండు పిల్లర్ల రిపేర్ చేయడం చేతకాక డ్రామాలు ఆడుతున్నారన్నారు. తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతగా తెలంగాణ నీటిని ఆంధ్రాకు తరలిస్తూ, స్థానిక రైతుల నోట్లో రేవంత్ మన్ను కొడుతున్నారని విమర్శించారు. దేవుడిపై నెపాలు వేస్తూ తెలంగాణను వంచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల కోర్టులో పరాభవం తప్పదని హెచ్చరించారు.
