ఎల్బీనగర్‌కు మహర్దశ.. 22A గ్రహణం వీడింది.. నేడే నివాసితులకు పట్టాల పంపిణీ!

LB Nagar

LB Nagar

LB Nagar: ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని నివాసితులకు దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుంది. నిషేధిత భూముల జాబితా (22A) కింద ఉన్న సుమారు 23 కాలనీల భూములను ఆ నిబంధనల నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాసనసభ వేదికగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఎల్బీనగర్ ప్రాంత ప్రజల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.

జీవో నంబర్ 118 కింద క్రమబద్ధీకరణ (రెగ్యులరైజేషన్) కోసం ఎల్బీనగర్ ప్రాంతం నుంచి మొత్తం 9,792 మంది బాధితులు దరఖాస్తు చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. అయితే ఈ భూములు 22A జాబితాలో ఉండటం వల్ల సుదీర్ఘకాలంగా రెగ్యులరైజేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం సెప్టెంబర్ 19వ తేదీన ‘మెమో నంబర్ 46940’ ను జారీ చేసింది. ఈ మెమో ద్వారా ఆటంకాలన్నీ తొలగిపోయి అర్హులైన వారందరికీ త్వరలోనే హక్కులు లభించనున్నాయి.

ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్న బాధితులకు స్వయంగా వెళ్లి పట్టాలు అందజేస్తానని మంత్రి అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 23 కాలనీల్లోని అర్హులైన లబ్ధిదారులకు నేటి మధ్యాహ్నం తానే స్వయంగా పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు.

22A నిషేధిత జాబితా నుంచి ఈ భూములను పూర్తిగా తొలగించడంతో పాటు రెగ్యులరైజేషన్ ప్రక్రియ వేగవంతం కానుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎల్బీనగర్ ప్రాంతంలో ఉన్న వేలాది కుటుంబాలకు సొంతింటి కల నిజం కానుంది. భూ క్రమబద్ధీకరణ పూర్తి కావడం వల్ల ఆస్తులపై యజమానులకు పూర్తిస్థాయి హక్కులు లభించనున్నాయి. క్రయవిక్రయాలు, బ్యాంక్ రుణాలు పొందడానికి మార్గం సుగమమైంది. దశాబ్దాల సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపిన ముఖ్యమంత్రికి, రెవెన్యూ మంత్రికి ఈ ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.