తెలంగాణ రాజకీయంలో బిగ్ డ్రామా.. సుప్రీంలో దానం నాగేందర్ వర్సెస్ బీఆర్‌ఎస్‌-బీజేపీ!

Danam Disqualification

Danam Disqualification

Danam Disqualification: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. బిఆర్‌ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరారనే అభియోగాలపై తనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులపై తక్షణమే స్టే ఇవ్వాలని, ఖైరతాబాద్ శాసనసభ స్థానాన్ని ఖాళీగా ప్రకటించడాన్ని నిలిపివేయాలని కోరుతూ ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలిచిన దానం నాగేందర్, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ బి-ఫారమ్‌పై సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. దీనిపై బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు, పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆయనను ఎమ్మెల్యే పదవి నుంచి అనర్హుడిగా ప్రకటిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టు నిర్ణయం వెలువడిన వెంటనే అప్రమత్తమైన దానం నాగేందర్, న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. హైకోర్టు తీర్పు అమల్లోకి వస్తే నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమవుతుందని, అందుకే సుప్రీంకోర్టులో స్టే సాధించాలని ఆయన వర్గం భావిస్తోంది. సోమవారం నాడు అత్యున్నత ధర్మాసనం ముందర ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు, ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. దానం నాగేందర్ పిటిషన్‌పై ఒకవేళ సుప్రీంకోర్టు ఏకపక్షంగా స్టే ఇవ్వకుండా ఉండేందుకు ముందస్తుగా కెవియట్ పిటిషన్లను దాఖలు చేశారు. తమ వాదనలు వినకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకూడదని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. దాంతో సుప్రీంకోర్టు సోమవారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఖైరతాబాద్‌లో ఉప ఎన్నికల నగారా మోగుతుందా లేదా అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.