Students Protest: గుంతలమయంగా మారిన రహదారికి మరమ్మతులు చేపట్టి, వెంటనే కొత్త రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలంలో విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. పెంచికల్పేట – బెజ్జూర్ మధ్య ఉన్న రోడ్డు దారుణంగా తయారవ్వడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోడ్డు సరిగ్గా లేకపోవడంతో ఆటోలు, ఇతర వాహనాలు నడవకపోవడం వల్ల నిత్యం పాఠశాలలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు వాపోయారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ‘ఎమ్మెల్యే డౌన్ డౌన్’ అంటూ పెద్దెత్తున నినాదాలు చేశారు. అధికారులు స్వయంగా వచ్చి రోడ్డు నిర్మాణానికి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తమ ఆందోళనను విరమించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల రాస్తారోకోతో ఆ మార్గంలో వాహనాలు నిలిచిపోయి తీవ్ర అంతరాయం ఏర్పడింది.
