నిండు గర్భిణి నుంచి ఎమ్మెల్యేల వరకు.. ఉత్తరాంధ్రలో ఉత్కంఠ రేపిన వరద రెస్క్యూ ఆపరేషన్స్!

Srikakulam floods

Srikakulam floods

Srikakulam floods: ఉత్తరాంధ్రను వాయుగుండం తీవ్రంగా కుదిపేస్తోంది. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతూ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలనకు వెళ్లిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సైతం వరద ఉధృతికి చిక్కుకోవడం తీవ్ర కలకలం రేపింది.

శ్రీకాకుళం జిల్లాలో క్షేత్రస్థాయి వరద పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌తో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మరియు ఇతర అధికారులు ఒక్కసారిగా పెరిగిన వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో తక్షణమే అప్రమత్తమైన ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు మలకపనిచేసి బోట్లలో అక్కడికి చేరుకుని వారందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. ప్రజాప్రతినిధి, అధికారులు వరదలో చిక్కుకున్నారనే వార్తలతో ఒక్కసారిగా ఆందోళన నెలకొన్నా, రెస్క్యూ టీమ్స్ సమయస్ఫూర్తితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లాలో 9 నెలల నిండు గర్భిణి వరద నీటిలో చిక్కుకోగా ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది లైఫ్ జాకెట్ తొడిగి సురక్షితంగా రక్షించి, ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. సాలూరులో ఆర్టీసీ కాంప్లెక్స్ జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్వయంగా పరిస్థితిని పరిశీలించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, రోడ్లు, చెరువులు, పంటల నష్టంపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.