భయపడే ప్రసక్తే లేదు.. రాజ్యాంగ రక్షణ కోసం వెనకడుగు వేయొద్దు.. యువతకు రాహుల్ గాంధీ భరోసా!

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: సీజేపీ ఆందోళనల పిలుపుతో దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక సందేశాన్ని ఇచ్చారు. రాజ్యాంగ హక్కులు, ఓటర్ల రక్షణ కోసం ఉద్యమిస్తున్న దేశ యువతను చూసి తాను గర్విస్తున్నానని ప్రకటిస్తూ, ‘పోరాటాన్ని ఆపవద్దు.. మీ వెనుక మేమున్నాం’ అంటూ వారికి బలమైన భరోసా ఇచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

దశాబ్ద కాలానికి పైగా తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలతో నిరంతరం పోరాటం చేస్తున్నానని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. తన ప్రత్యర్థుల వ్యూహాలు, ఆలోచనలు తనకు పూర్తిగా తెలుసని చెప్పారు. ప్రస్తుత రాజకీయ వేదికపై సాగుతున్న ఈ కథలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్, సీఈసీ జ్ఞానేష్ కుమార్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అసలైన విలన్లు అని తీవ్రంగా అభివర్ణించారు.

బీజేపీ నైజంలోనే పిరికితనం ఉందని విమర్శించిన ఆయన, అణచివేత చర్యలకు భయపడే ప్రసక్తే లేదన్నారు. నగరంలో ప్రధాని మోదీ ఎంతమంది పోలీసులను, భద్రతా బలగాలను మోహరించినా, తనతో పాటు ఇతర నాయకులను అరెస్టు చేసినా తాము వెనక్కి తగ్గబోమని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్యం, హక్కుల పరిరక్షణ కోసం చేపట్టిన ఈ పోరాటం ఎప్పటికీ ఆగదని స్పష్టం చేశారు.