మైక్ పట్టుకుంటే జర్నలిస్ట్ కాలేరు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై సుప్రీం కీలక వ్యాఖ్యలు!

Supreme Court

Supreme Court

Supreme Court: డిజిటల్ యుగంలో చేతిలో మైకు, స్మార్ట్‌ఫోన్ పట్టుకుని ఎవరికివారే రోడ్డు మీదకొచ్చి “మేమూ జర్నలిస్టులమే” అని చలామణి కావడం సమాజంలో విపరీతమైన అరాచకానికి, అనేక తీవ్ర సమస్యలకు దారితీస్తుందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పదునైన హెచ్చరికలు జారీ చేసింది. మహిళా జర్నలిస్టులపై పోలీసులు దాడులు, వేధింపులకు పాల్పడ్డారని దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

జర్నలిజం ముసుగులో ఉన్న ప్రతిఒక్కరినీ ఒకే గాటన కట్టలేమని, అధికారిక గుర్తింపు (అక్రిడిటేషన్) ఉన్న నికార్సైన జర్నలిస్టులకే చట్టప్రకారం ప్రత్యేక రక్షణలు ఉంటాయని ధర్మాసనం తెగేసి చెప్పింది. ప్రెస్ కౌన్సిల్ పరిధిలోని పత్రికలు, టీవీ ఛానళ్లలో పనిచేసే అసలైన విలేకరులకు, డిజిటల్ సోషల్ మీడియాలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్లకు తేడా ఉందన్న విషయాన్ని గుర్తించాలని స్పష్టం చేసింది. రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్ర్యం ప్రతీ పౌరుడికీ జర్నలిస్టుగా గుర్తింపును ఇస్తుందా అన్న కీలక అంశంపై లోతైన విచారణ జరుపుతామని తేల్చిచెప్పింది.

విచారణ వేళ పిటిషనర్ల వాదనపై కేంద్ర ప్రభుత్వం తరఫు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఘాటుగా స్పందించారు. ఆందోళనల వద్ద మైక్ పట్టుకుని ‘రీల్స్’ చేసుకునే వాళ్లంతా తమను జర్నలిస్టులుగా ప్రచారం చేసుకుంటూ వ్యవస్థలను బ్లాక్‌మెయిల్ చేసే స్థాయికి దిగజారారని నిలదీశారు. అసలైన విలేకరులకు, కేవలం వ్యూస్ కోసం రీల్స్ చేసే వాళ్లకు తేడా లేకుండా పోయిందని, ప్రతీ ఒక్కరికీ జర్నలిస్టు రక్షణలు కల్పించడం కుదరదని సుప్రీం ధర్మాసనం ముందే విరుచుకుపడ్డారు.

మహిళా జర్నలిస్టుపై తప్పుడు కేసు బనాయించిన పోలీసులకు షాక్!

పోలీసుల వేధింపులపై గొంతు విప్పిన మహిళా జర్నలిస్టునే బెదిరించేలా, ఆమెపైనే ఎదురు ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టం కింద తప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన స్థానిక పోలీసుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలిపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల ఏకపక్ష విచారణను తోసిపుచ్చుతూ, మహిళా అధికారులతో కూడిన ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటుపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది.