Jagtial Reels: సోషల్ మీడియా వేదికగా కొందరు యువకులు బెదిరింపులకు దిగడం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో కలకలం రేపింది. ఏకంగా పోలీస్ స్టేషన్ సమీపంలోనే చంపుతామని, నరుకుతామని హెచ్చరిస్తూ అసభ్య పదజాలంతో వీడియో రూపొందించి ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాల్లో పోస్టు చేయడంతో పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఈ బెదిరింపు వీడియో వ్యవహారంలో పోలీసులు తొమ్మిది మంది యువకులపై కేసు నమోదు చేశారు.
ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన
ఈ నెల 25వ తేదీన మండలంలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన నేరెళ్ల అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొడిమ్యాల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కొందరు యువకులు ఉద్దేశపూర్వకంగానే భయభ్రాంతులకు గురిచేసేలా, బెదిరింపులతో కూడిన వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియా వేదికల్లో పోస్టు చేసినట్లు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వీడియో ఆధారంగా నిందితులను గుర్తించి విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
