మినిట్2మినిట్ డెస్క్, హైదరాబాద్:
ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించడం తీవ్ర కలకలం రేపింది. ఎర్రగడ్డ మోతీనగర్‌లోని తన సోదరుడి ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం ఎస్సార్ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
కేసు నమోదుతో తీవ్ర డిప్రెషన్:
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఉదయ్ కృష్ణారెడ్డిపై ఆయన సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్(కర్నాటక) తీవ్ర ఆరోపణలు చేశారు. తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆమె ఆదివారం అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళా అధికారిణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తమ సహచర అధికారిణే ఫిర్యాదు చేయడంతో పాటు కేసు నమోదు కావడంతో ఉదయ్ కృష్ణారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురై, డిప్రెషన్‌కు లోనైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన సోదరుడి ఇంటికి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు సమాచారం.
ఈ ఘటనపై ఎస్సార్ నగర్ అలాగే అత్తాపూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆసుపత్రి వద్ద ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితిని పోలీసులు సమీక్షిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
