దుబాయ్‌లో మలయాళీల రాజ్యం..
ఎందుకో తెలుసా?
1970ల చమురు విప్లవంతో గల్ఫ్ బాట పట్టిన కేరళీయులు
హైలైటింగ్ నెట్వర్క్, కమ్యూనిటీ మద్దతుతో అగ్రస్థానానికి ఎదిగిన వైనం
వ్యాపారాలు, రిటైల్ రంగాలు, ఆసుపత్రుల వరకు మలయాళీల హవా
తరతరాలుగా సాగుతున్న చైన్ మైగ్రేషన్
మినిట్ 2 మినిట్, స్పెషల్ డెస్క్ (ఆగస్ట్ 27): దుబాయ్ అనగానే మొదట గుర్తుకువచ్చే మలయాళీలే! గల్ఫ్ దేశాలలో మిగిలిన భారతీయుల కంటే కేరళీయుల వ్యాపారాలు, ఉద్యోగాలు, ప్రభావం చాలా ఎక్కువగా ఉంటాయి. యూసుఫ్ అలీ (లులు గ్రూప్), రవి పిళ్లై, డాక్టర్ ఆజాద్ మూపెన్ వంటి బిలియనీర్ల నుంచి మొదలుకొని టీ కొట్లు, సూపర్ మార్కెట్లు, ట్రావెల్ ఏజెన్సీల వరకు యూఏఈలో మలయాళీల సామ్రాజ్యం విస్తరించింది. అసలు ఈ గల్ఫ్ డ్రీమ్ ఎలా మొదలైంది?
దీనికి ప్రధాన కారణం 1970ల నాటి ‘ఆయిల్ బూమ్’ (చమురు విప్లవం). దుబాయ్, యూఏఈ నగరాలు నిర్మితమవుతున్న సమయంలో మౌలిక వసతులు, శ్రమశక్తి కోసం భారీగా మనుషులు అవసరమయ్యారు. ప్రాచీన కాలం నుంచే సముద్ర మార్గం గుండా అరబ్ దేశాలతో వర్తక సంబంధాలు ఉన్న కేరళ ప్రజలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని విరివిగా దుబాయ్ బాట పట్టారు. మొదట్లో కార్మికులుగా వెళ్లిన వీరు, కాలక్రమేణా తమ నైపుణ్యంతో మేనేజర్లుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు.
కేరళీయులకు దుబాయ్ డెస్టినేషన్ కావడానికి, ఇప్పటికీ ప్రాధాన్యత ఇవ్వడానికి కేరళలోని స్థానిక పరిస్థితులే మూలకారణం. కేరళలో అక్షరాస్యత అత్యధికంగా ఉన్నప్పటికీ, అక్కడ భారీ పరిశ్రమలు, ఐటీ రంగాలు అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందలేదు. రాజకీయ కారణాలు, పారిశ్రామిక ప్రోత్సాహం లేకపోవడంతో యువతకు సరిపడా ఉద్యోగాలు లభించలేదు. దీంతో మెరుగైన వేతనాలు, జీవన ప్రమాణాల కోసం విదేశాలకు వెళ్లడమే ఏకైక మార్గంగా మారింది.
ఒకరు వెళ్లి స్థిరపడ్డాక తమ గ్రామానికి, కుటుంబానికి చెందిన వారిని దుబాయ్‌కి తీసుకురావడం (‘చైన్ మైగ్రేషన్’) తరతరాలుగా సాగింది. ఒకరికొకరు వ్యాపార అవకాశాలు ఇచ్చుకోవడం, సొంత నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడంతో యూఏఈ ఆర్థిక వ్యవస్థలో మలయాళీలు కీలక శక్తిగా మారారు. కేరళ ఆర్థిక రంగానికి కూడా అక్కడి నుంచి వచ్చే ‘రెమిటెన్స్’ (విదేశీ ద్రవ్యం) ప్రధాన వెన్నుముకగా నిలిచింది.
