మైనింగ్ ఏడీ బొజ్జ జయరాజ్‌కి 14 రోజుల రిమాండ్!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన ఆఫీసర్
హైదరాబాద్, భూపాలపల్లి, సూర్యాపేట, తాండూరు సహా 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు
మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.65 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తింపు
వరంగల్ ఏసీబీ కోర్టు ఆదేశాలతో భారీ భద్రత నడుమ సెంట్రల్ జైలుకు తరలింపు
మినిట్ 2 మినిట్, వరంగల్ (ఆగస్ట్ 29): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బొజ్జ జయరాజ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హోదాను అడ్డుపెట్టుకుని అక్రమంగా కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్, భూపాలపల్లి, సూర్యాపేట, తాండూరు సహా ఒకేసారి 12 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో జయరాజ్, ఆయన బినామీల పేరిట ఉన్న భారీ ఆస్తుల గుట్టు రట్టయింది. ప్రైవేట్ మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.65 కోట్లకు పైగా విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. ఇళ్లల్లో లభ్యమైన భారీ నగదు, కేజీల కొద్దీ బంగారు ఆభరణాలు, విలాసవంతమైన ఫ్లాట్లు, ఎకరాల కొద్దీ వ్యవసాయ భూములు, ఖరీదైన లగ్జరీ కార్లు, వివిధ బ్యాంకు డిపాజిట్లకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సోదాలు, సుదీర్ఘ విచారణ పూర్తయిన తర్వాత జయరాజ్‌ను అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి వరంగల్‌లోని ఏసీబీ ప్రత్యేక నాయస్థానంలో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి జయరాజ్‌కు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు భారీ భద్రతా సిబ్బంది నడుమ అధికారులు ఆయనను వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు. ప్రభుత్వ అధికారుల అక్రమ సంపాదనపై ఏసీబీ నిరంతరం నిఘా ఉంచుతుందని, అవినీతికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
