స్కూళ్లలో ఇంటర్ విలీనానికి ప్రైవేట్ యాజమాన్యాల జై.. కానీ ఓ కండీషన్!

Telangana Education

Telangana Education

Telangana Education: రాష్ట్రంలో 2027-28 విద్యా సంవత్సరం నుంచి 11, 12 తరగతులను (ఇంటర్మీడియట్) పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా – TRSMA) స్వాగతించింది. ఈ మేరకు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. మధుసూదన్, ప్రధాన కార్యదర్శి ఎన్. రమేష్ రావు, కోశాధికారి పి. రఘువేందర్ రెడ్డి శుక్రవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహదపడాలి:

ప్రభుత్వం తీసుకురానున్న ఈ నూతన విద్యా సంస్కరణ కేవలం మార్పు కోసమే కాకుండా, విద్యార్థుల నైపుణ్యాల పెంపుదలకు, వారి సమగ్ర వికాసానికి దోహదపడేలా ఉండాలని ట్రస్మా నేతలు ఆకాంక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన అన్‌ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తమ సంఘానికి, ఈ నూతన విధాన రూపకల్పన కమిటీలు మరియు ప్రభుత్వ సంప్రదింపుల్లో తగిన భాగస్వామ్యం కల్పించాలని వారు కోరారు.

విస్తృత చర్చల తర్వాతే తుది నిర్ణయం:

ఇంటర్మీడియట్ విలీనం అనేది లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల యాజమాన్యాల భవిష్యత్తుపై ప్రత్యక్ష ప్రభావం చూపే అత్యంత కీలకమైన అంశమని వారు గుర్తుచేశారు. అందువల్ల ఎలాంటి తొందరపాటు లేకుండా, విస్తృత స్థాయిలో చర్చలు జరిపిన అనంతరమే ఈ విధానాన్ని ఖరారు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

ముందుగా ప్రభుత్వం ఒక స్పష్టమైన ముసాయిదా విధానాన్ని (డ్రాఫ్ట్ పాలసీ) విడుదల చేయాలని ట్రస్మా నేతలు డిమాండ్ చేశారు. ఆ ముసాయిదాపై పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యావేత్తలు, వృత్తి విద్యా నిపుణులతో పాటు సామాన్య ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు, అభ్యంతరాలను సేకరించిన తర్వాతే అమలులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.