Couple Doctorate: ఉస్మానియా విశ్వవిద్యాలయం 85వ స్నాతకోత్సవం ఒక అరుదైన, మరచిపోలేని మధుర ఘట్టానికి వేదికగా నిలిచింది. ఒకే వేదికపై, ఒకే రోజు భార్యాభర్తలిద్దరూ ఓయూ వైస్ ఛాన్స్‌లర్ కుమార్ మొలుగురం చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాలు అందుకోవడంతో స్నాతకోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పట్టువదలకుండా శ్రమించి పరిశోధనలు పూర్తి చేసిన ఆ దంపతులు ఎన్. స్రవంతి, యు.ఎస్.హెచ్. రాఘవేంద్ర ప్రసాద్. అధ్యాపక వృత్తిలో ఉన్న ఇద్దరూ.. డాక్టరేట్ పట్టాల సాధనతో పలువురికి ఆదర్శంగా నిలిచారు.
లక్డీకపూల్‌లోని టీజీఎమ్‌ఆర్‌ఎస్ ఆసిఫ్‌నగర్ గర్ల్స్-1 పాఠశాలలో జనరల్ సైన్స్ టీచర్‌గా సేవలందిస్తున్న ఎన్. స్రవంతి కెమిస్ట్రీ విభాగంలో డాక్టరేట్ సాధించారు. “హోమోలజీ మోడలింగ్ అండ్ వర్చువల్ స్క్రీనింగ్ ఆఫ్ Rho GTPase ఫ్యామిలీ ప్రొటీన్స్: ఏ కంప్యూటేషనల్ అప్రోచ్ టువర్డ్స్ క్యాన్సర్ థెరపీ” అనే అంశంపై ఓయూ అసోసియేట్ ప్రొఫెసర్ కవిత పర్యవేక్షణలో ఆమె తన థీసిస్ పూర్తి చేశారు. భర్త రాఘవేంద్ర ప్రసాద్, తల్లిదండ్రులు ఎన్. జనార్దన్, రోహిణి, అత్తమామలు, గురువులు, స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యుల సహకారంతోనే పరిశోధన పూర్తి చేసినట్లు స్రవంతి తెలిపారు. ముఖ్యంగా తన గైడ్ కవిత ప్రోత్సాహాన్ని ఎన్నటికీ మరవలేనన్నారు.
ఇక యు.ఎస్.హెచ్. రాఘవేంద్ర ప్రసాద్ కూడా కెమిస్ట్రీ విభాగంలోనే “కంప్యూటేషనల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ నావెల్ స్మాల్ మాలిక్యూల్ లీడ్స్ టార్గెటింగ్ RAD51 పారాలాగ్స్” అనే అంశంపై తన పరిశోధనను పూర్తి చేసి డాక్టరేట్ పట్టాను స్వీకరించారు. ఆయన ప్రస్తుతం వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ విజయంలో సహకరించిన అందరికీ, మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు యు.ఎస్.హెచ్. హరిప్రసాద్, సువర్ణ, తన భార్య స్రవంతికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎంత ఒత్తిడిలో ఉన్నా తనకు తోడుగా ఉంటూ థీసిస్ కంప్లీట్ చేయడంలో సహకరించారని, అలాగే ఓయూ అసోషియేట్ ప్రొఫెసర్ కవిత పర్యవేక్షణ తనకు ఎంతో మేలు చేసిందన్నారు. ఒకరు పాఠశాల, మరొకరు కళాశాలలో బోధన సాగిస్తూనే, ఉన్నత విద్యపై ఉన్న మక్కువతో ఇద్దరూ ఒకే సబ్జెక్టులో పీహెచ్‌డీ పూర్తి చేయడం గమనార్హం. వీరిద్దరి విజయంపై స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ స్నేహితులు సాధించిన విజయం మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని మినిట్ 2 మినిట్‌తో వ్యాఖ్యానించారు.
