బడిలో రాజకీయం వద్దు.. బతుకు పోరాటంలో భయం వద్దు!

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh:  విద్యా వ్యవస్థలో రాజకీయ జోక్యానికి అడ్డుకట్ట వేస్తూ ‘నో పాలిటిక్స్ ఇన్ స్కూల్స్’ విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో నైతిక విలువలను నూరిపోస్తే ఏపీ విద్యా విధానం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని ఆకుండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణంలో విద్యాశాఖ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారతీయం’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

రాష్ట్రంలోని సర్కారీ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఈ ఒక్క ఏడాదే ప్రైవేట్ పాఠశాలల నుంచి దాదాపు 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, ఇంటర్ విద్యలోనూ మరో 10 వేల అడ్మిషన్లు పెరిగాయని వివరించారు. చదువుతో పాటు చిన్నతనం నుంచే పెద్దలను, మహిళలను గౌరవించడం, గెలుపోటములను సమానంగా స్వీకరించడం పిల్లలకు నేర్పించాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఆశించిన మార్పు తరగతి గది నుంచే ప్రారంభమవుతుందని అభిప్రాయపడ్డారు.

కష్టపడి చదవడమే విజయానికి బాట అని, దానికి ఎలాంటి షార్ట్‌కట్‌లు ఉండవని విద్యార్థులకు సూచించారు. చదువుల ఒత్తిడి లేదా సమస్యలు ఎదురైనప్పుడు ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని హితవు పలికారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులతో పంచుకోవాలని కోరారు.