దళారులకు చెక్, అర్హులకే ఇళ్లు.. పొంగులేటి కీలక ప్రకటన, ఆంక్షలు ఎత్తివేత!

Indiramma Housing

Indiramma Housing

Indiramma Housing: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలనుకుంటున్న నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇళ్లు నిర్మించుకునే క్రమంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణ పనులకు ఎలాంటి అడ్డంకులు రాకుండా నిబంధనలను సులభతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ వివరాలను స్వయంగా వెల్లడించారు. ఇప్పటికే మంజూరై, బేస్‌మెంట్ అలాగే అంతకంటే పైస్థాయికి చేరుకున్న ఇళ్లకు ఎల్ 3 నుంచి ఎల్ 1 వరకు ఒకేసారి నిధులు విడుదల చేయడానికి ప్రత్యేక సడలింపు ఇచ్చారు. ఈ నిర్ణయంతో నిధుల కొరత లేకుండా వేగంగా పనులు పూర్తవుతాయి.

ప్రారంభించని ఇళ్ల రద్దు!
ఇళ్లు మంజూరైన తర్వాత కూడా ఇప్పటివరకు పనులు ప్రారంభించని వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. నిర్లక్ష్యంగా ఉంటూ పనులు మొదలుపెట్టని వారి ఇళ్లను వెంటనే రద్దు చేయాలని నిర్ణయించారు. ఆ స్థానంలో ఇల్లు లేక ఇబ్బందిపడుతున్న ఇతర అర్హులైన పేదలకు ఆ అవకాశాన్ని కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఈ రకమైన వన్ టైమ్ క్లియరెన్స్ నిర్ణయం ద్వారా పడే అదనపు ఆర్థిక భారానంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

ఖరీదైన ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ టవర్స్
పేద ప్రజలను నగరానికి దూరంగా పంపించే ఆలోచన కాకుండా, అత్యంత ఖరీదైన ప్రాంతాల్లోనే వారిని గౌరవంగా బతికించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గం వద్ద వందల కోట్ల విలువైన స్థలంలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 17 నుంచి 20 గుంటల వరకు ఉండే స్థలాల్లో అపార్ట్‌మెంట్ టైప్‌లో ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నారు. వీటికి సంబంధించిన అన్‌డివైడెడ్ షేర్, సేల్ డీడ్, రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం కూడా లేకుండా పేదలకు పూర్తి హక్కులు కల్పిస్తున్నారు.

రాజకీయాలకు తావు లేదు!
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి రాజకీయ జోక్యానికి గానీ, దళారుల ప్రమేయానికి గానీ చోటు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరేలా పారదర్శకంగా పంపిణీ సాగుతుందని మంత్రి వివరించారు. ఆంక్షలు తొలగించి, వన్ టైమ్ క్లియరెన్స్ ఇవ్వడం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.