బ్రాండింగ్‌లో కొత్త విప్లవం.. తక్కువ ఇస్తేనే ఎక్కువ గుర్తింపు

Minimalist Branding

Minimalist Branding

Minimalist Branding: సాధారణంగా ఏ బ్రాండైనా మార్కెట్లో నిలబడాలంటే ఏం చేస్తుంది? ఆకర్షణీయమైన రంగులు, పెద్ద పెద్ద ప్రకటనలు, లేబుల్‌పై అదనపు డిజైన్లు.. ఇలా చాలా విషయాలను జోడించడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే అందరూ చేస్తున్న పద్దతి అదే. కానీ, జపాన్‌కు చెందిన ఒక వినూత్న వాటర్ బ్రాండ్ దీనికి పూర్తి భిన్నంగా ఆలోచించింది. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఆ కంపెనీ బాటిల్ లేబుల్ పరిమాణాన్ని అత్యంత కనిష్ట స్థాయికి కుదించేసింది. చూడటానికి ఆ బాటిల్ మీద ఎలాంటి అతుకులు లేదా పెద్ద పేపర్లు లేకుండా, పూర్తిగా పారదర్శకంగా, కేవలం నీటి స్వచ్ఛత మాత్రమే కనిపించేలా తయారైంది.

వ్యర్థాల తగ్గింపు నుంచి బ్రాండ్ ప్రత్యేకత వరకు

ఆ కంపెనీ తీసుకున్న ఆ చిన్న నిర్ణయం కేవలం పర్యావరణ పరిరక్షణతోనే ఆగిపోలేదు, వ్యాపారపరంగా కూడా అద్భుతాలు సృష్టించింది. మార్కెట్లో వందలాది వాటర్ బాటిల్స్ ఒకేలా, రంగురంగుల లేబుల్స్‌తో పోటీపడుతున్న తరుణంలో.. ఈ లేబుల్ లేని సరికొత్త బాటిల్ కస్టమర్ల కళ్లలో సులభంగా పడింది. మిగతా బ్రాండ్లు అన్నీ రొటీన్‌గా కనిపిస్తుంటే, ఈ పారదర్శక బాటిల్ మాత్రం వినూత్నంగా, చాలా సింపుల్‌గా నిలబడింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బ్రాండ్‌ను గుర్తించడానికి పెద్ద లోగోలు అవసరం లేదని, ఆ సరళతే ఆ బ్రాండ్‌కు బలమైన సంతకం అయిందని నిరూపితమైంది.

కామోడిటీ మార్కెట్‌లో సింప్లిసిటీయే అసలైన ఆయుధం

ఈ రోజుల్లో చాలా కంపెనీలు అమ్ముతున్న ప్రాథమిక ఉత్పత్తి ఒకటే. నీళ్లు, ఉప్పు, పంచదార వంటి సాధారణ వస్తువులను అమ్మే బ్రాండ్లు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఉత్పత్తి ఒకేలా ఉన్నప్పుడు, కస్టమర్‌ను ఆకర్షించడానికి బ్రాండ్లు ప్యాకేజింగ్ మీదే ఎక్కువ ఖర్చు పెడుతుంటాయి. కానీ, ఈ జపనీస్ బ్రాండ్ చూపిన దారి ఇందుకు విరుద్ధం. ప్రత్యేకంగా కనిపించడానికి అనవసరమైన వాటిని మరింత జోడించడం కంటే, అసలు ఏది అవసరం లేదో దానిని తొలగించడమే నిజమైన గ్రేట్ ఐడియా అని ఇది రుజువు చేసింది. ఆ సుస్థిరత (Sustainability) కోణమే ఆ కంపెనీకి సరికొత్త విజువల్ ఐడెంటిటీని తెచ్చిపెట్టింది.

వ్యాపార పాఠం: సింపుల్ ఐడియానే బిగ్‌ సక్సెస్ మంత్రం

మీ ఉత్పత్తి ఎంత సాధారణమైనదైనా సరే, మీ బ్రాండ్ ఎల్లప్పుడూ ఆడంబరంగా ఉండాల్సిన పనిలేదని ఈ ఉదాహరణ స్పష్టం చేస్తుంది. ఇతరుల నుంచి విభిన్నంగా నిలబడటానికి క్లిష్టమైన మార్గాలను వెతకాల్సిన అవసరం లేదు. ఒక బలమైన, సరళమైన ఆలోచనను పట్టుకుని, దానిని నమ్మకంతో అమలు చేస్తే చాలు… అదే మీ వ్యాపారాన్ని విజయతీరాలకు చేరుస్తుంది. కొన్నిసార్లు తక్కువగా ఇవ్వడమే కస్టమర్ల మనసులో లోతుగా నాటుకుపోయేలా చేస్తుందనడానికి ఇదే సజీవ సాక్ష్యం.