కేరళ గడ్డపై సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ 2026’ అవార్డు ప్రదానం!

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్ బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ 2026’ పురస్కారం వరించింది. కేరళంలోని నిలంబూర్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చేతుల మీదుగా సీఎం రేవంత్ ఈ అవార్డును అందుకున్నారు. తెలంగాణలో రైతులు, వెనుకబడిన వర్గాలు (బీసీ), ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగిస్తున్న పాలనకు గుర్తింపుగా జ్యూరీ ఈ అవార్డును సీఎంకు ప్రదానం చేసింది. కేరళం వెలుపల నుంచి ఈ గౌరవాన్ని పొందిన తొలి వ్యక్తిగా నిలవడం పట్ల రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

అవార్డు ప్రధానోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ రాజకీయ వాతావరణంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం ‘సంఘ్ పరివార్’, ‘గాంధీ పరివార్’ భావజాలాల నడుమ పోరాటం జరుగుతోందని పేర్కొన్నారు. మతం, భాష, సంస్కృతి, కులం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు రేపుతూ సంఘ్ పరివార్ దేశాన్ని విడగొట్టేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. మరోవైపు మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వంటి మహనీయులు దేశ సమగ్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని గుర్తుచేశారు.

కేరళం రాజకీయాల్లో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు మంత్రిగా సేవలు అందించిన ఆర్యదాన్ ముహమ్మద్‌ను గొప్ప దౌత్యవేత్తగా, చాణక్యుడిగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. నిలంబూర్‌తో పాటు కేరళం కాంగ్రెస్ పార్టీకి ఆయన మహావృక్షంలా అండగా నిలిచారని కొనియాడారు. కేరళం ప్రజలు లౌకికవాదానికి, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. భారత్ జోడో యాత్ర, అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు ఇక్కడ లభించిన ఆత్మీయ స్వాగతాన్ని ఈ సందర్భంగా సీఎం రేవంత్ గుర్తుచేసుకున్నారు.