Khairatabad Ganesh: నవరాత్రుల పాటు నిత్య పూజలందుకున్న ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా, భావోద్వేగభరిత వాతావరణంలో ముగిసింది. శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతిగా దర్శనమిచ్చిన స్వామివారు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. శోభాయాత్రలో భాగంగా ఖైరతాబాద్ మండపం నుంచి బయలుదేరిన మహా గణనాథుని ఊరేగింపు సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకుంది. దారిపొడవునా భక్తులు జయజయధ్వానాలు, నామస్మరణలు చేస్తూ గణనాథుడికి నీరాజనాలు అర్పించారు.
అక్కడి నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 5 వద్ద హుస్సేన్ సాగర్ జలాల్లో మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. స్వామివారి చివరి దర్శనం కోసం, నిమజ్జన ఘట్టాన్ని కళ్లారా తిలకించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. శోభాయాత్ర సాగినంత మేరా రోడ్లన్నీ భక్తజనంతో కిక్కిరిసిపోయాయి. శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో ముగిసేలా పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. భక్తులంతా నమస్కరిస్తూ విఘ్నేశ్వరుడికి భావోద్వేగంగా వీడ్కోలు పలికారు.
