దమ్ముంటే పార్లమెంట్‌కు రా.. రాహుల్‌కు అమిత్ షా ఓపెన్ ఛాలెంజ్!

Amit Shah

Amit Shah

Amit Shah: హైదరాబాద్ నడిబొడ్డున రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈవీఎంల విశ్వసనీయత, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (ఎస్‌ఆర్ఆర్/ఎస్‌ఐఆర్), దేశంలోకి అక్రమ చొరబాట్లపై నిరంతరం విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన సవాల్ విసిరారు. బీజేపీ చేపట్టిన మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా మొజంజాహి మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

ఈవీఎంలు, ఓటర్ల సవరణపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే సభకు వచ్చి ప్రత్యక్ష చర్చలో పాల్గొనాలని రాహుల్ గాంధీకి నేరుగా సవాల్ విసిరారు. ఎన్నికల్లో గెలిస్తే ప్రజల విజయం అని, ఓడిపోతే ఈవీఎంల లోపమని సాకులు చెప్పడం కాంగ్రెస్ అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ఈవీఎంలలో అక్రమాలు ఉంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అధికారంలోకి వచ్చిందో, ఇతర రాష్ట్రాల్లో ఎలా గెలిచారో సమాధానం చెప్పాలని నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయం కోసం అక్రమ చొరబాటుదారులను ప్రోత్సహిస్తోందని, ఓటర్ల జాబితా నుంచి ఒక్క చొరబాటుదారుడికి కూడా హక్కు దక్కనివ్వబోమని స్పష్టం చేశారు.

అలాగే రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన అమిత్ షా.. తెలంగాణను ఢిల్లీ కాంగ్రెస్ దర్బార్‌కు ఏటీఎంగా మార్చేశారని ఆరోపించారు. ఇక్కడ వసూలు చేస్తున్న ఆర్‌ఆర్ ట్యాక్స్ నేరుగా రాహుల్ గాంధీ జేబుల్లోకి వెళ్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ అవినీతిని అడ్డుకునే సత్తా బీఆర్ఎస్ లేదా ఒవైసీకి లేదని, కేవలం బిజెపితోనే సాధ్యమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య చర్చలకు రాకుండా పార్లమెంట్‌ను అడ్డుకోవడం కాంగ్రెస్ దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు.