VC Sajjanar: హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను ఉద్దేశించి సీబీఐ మాజీ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం. నాగేశ్వరరావు చేసిన సోషల్ మీడియా వ్యాఖ్యల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇటీవల సజ్జనార్ బదిలీ నేపథ్యంలో నాగేశ్వరరావు తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో తీవ్ర పదజాలంతో పోస్టు పెట్టారు. ఆయన్ను ‘యూనిఫామ్ వేసుకున్న నేరస్తుడు’గా అభివర్ణిస్తూ చేసిన ఆ వ్యాఖ్యలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు.
చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధం
నాగేశ్వరరావు చేసిన పోస్టు భారతీయ చట్టాలను ఉల్లంఘించేలా ఉందని పేర్కొంటూ, ఆ కంటెంట్‌పై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం ‘ఎక్స్’ సంస్థకు అధికారికంగా అభ్యర్థన పంపింది. దీనిపై స్పందించిన ‘ఎక్స్’ యాజమాన్యం, ప్రభుత్వ లేదా చట్ట అమలు సంస్థల నుంచి ఫిర్యాదు అందినప్పుడు వినియోగదారులకు తెలియజేయడం తమ విధానమని పేర్కొంటూ నాగేశ్వరరావుకు ఈమెయిల్ నోటీసు జారీ చేసింది. ఈ అభ్యర్థనను న్యాయస్థానంలో సవాలు చేయడం లేదా న్యాయ సలహా తీసుకోవడం వంటి మార్గాలను పరిశీలించుకోవచ్చని ‘ఎక్స్’ తన నోటీసులో సూచించింది. ఇద్దరు ఉన్నత స్థాయి మాజీ, ప్రస్తుత పోలీసు అధికారుల మధ్య నడుస్తున్న ఈ వ్యవహారం ఇప్పుడు అధికార, సామాజిక మాధ్యమ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
