Home Guard: రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు తెలంగాణ పోలీస్ శాఖ తీపికబురు అందించింది. తెలంగాణ వ్యాప్తంగా 2 వేల హోంగార్డు పోస్టుల భర్తీకి పోలీస్ శాఖ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం డీజీపీ కార్యాలయంలో మినీ స్టాఫ్ ఆఫీసర్స్ సమావేశం నిర్వహించిన డీజీపీ సీవీ ఆనంద్, పలు కీలక అంశాలపై ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు.
నియామకాలు, సిబ్బంది సంక్షేమంపై ప్రధాన దృష్టి:
హోంగార్డుల నియామక నోటిఫికేషన్ విడుదలతో పాటు, పోలీస్ శాఖకు సంబంధించిన వార్షిక శిక్షణ క్యాలెండర్‌ను సిద్ధం చేయడంపై డీజీపీ చర్చించారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పోలీస్ శాఖ మంజూరైన సిబ్బంది సంఖ్యను పునఃసమీక్షించడం, రిటైర్డ్ పోలీస్ అధికారుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమాలోచనలు జరిపారు. సమావేశంలో చర్చించిన ప్రతి అంశానికి సంబంధించి అధికారులకు నిర్దిష్ట బాధ్యతలు అప్పగించడంతో పాటు, పనుల పూర్తికి గడువులు కూడా నిర్ణయించారు. నిర్ణీత సమయంలో లక్ష్యాలను పూర్తి చేయాలని డీజీపీ ఆదేశించారు.
పోలీస్ రిట్రీట్, నూతన మాన్యువల్‌పై సమీక్ష:
పోలీస్ శాఖలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన అభివృద్ధి ప్రణాళికలు, సిబ్బంది సంక్షేమంపై డీజీపీ చర్చించారు. వచ్చే నెలలో నిర్వహించనున్న పోలీస్ రిట్రీట్, మహిళా పోలీస్ అధికారుల సదస్సు, నూతన తెలంగాణ పోలీస్ మాన్యువల్ రూపకల్పన పూర్తి చేసి విడుదల చేయడం, పోలీస్ బ్రాస్ మరియు పైప్ బ్యాండ్‌ను పునరుద్ధరించడం వంటి అంశాలపై సమీక్షించారు. రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్, ఆల్ ఇండియా పోలీస్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణపైనా చర్చ జరిగింది.
ఈ సమావేశంలో డీజీ విమెన్ సేఫ్టీ వింగ్ సౌమ్య మిశ్రా, టీజీఎస్పీ డైరెక్టర్ అభిలాష బిస్త్, డీజీ, ఏసీబీ అండ్ సీఐడీ చారు సిన్హా, టీజీఎస్పీ ఏడీజీ సంజయ్ కుమార్ జైన్, ఏడీజీ (లా అండ్ ఆర్డర్) అనిల్ కుమార్, ఐజీ పీఅండ్‌ఎల్ గజరావ్ భూపాల్‌తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
