ఐటీ కారిడార్ ట్రాఫిక్‌కు ‘వన్-వే’ చెక్.. బస్సులకు ఇకపై సెపరేట్ రూట్!

Cyberabad Traffic

Cyberabad Traffic

Cyberabad Traffic: సైబరాబాద్ పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు త్వరలోనే వన్-వే వ్యవస్థతో పాటు బస్సుల కోసం ప్రత్యేక మార్గాలను (డెడికేటెడ్ బస్ లేన్స్) అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ నూతన విధానాల అమలుకు నగరవాసులు పోలీసు యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు. సైబరాబాద్ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే లక్ష్యంతో సీఎంసీ, సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహించిన ‘సైబరాబాద్ మూవ్స్-2026’ సదస్సును డీజీపీ ప్రారంభించారు.

80 శాతం సొంత వాహనాలతోనే తీవ్ర రద్దీ

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. గత రెండు దశాబ్దాల్లో సైబరాబాద్ ప్రాంతం భారీగా విస్తరించిందని, ప్రస్తుతం ఇక్కడ సుమారు 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. వీరిలో దాదాపు 80 శాతం మంది సొంత వాహనాలను వినియోగిస్తుండటంతో ఐటీ కారిడార్‌లో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రధాన కూడళ్లను ఆధునీకరించే దిశగా సైబరాబాద్ పోలీసులు, సెక్యూరిటీ కౌన్సిల్, లివింగ్ ల్యాబ్ సంస్థల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. పోలీసులు ఎంతగా శ్రమిస్తున్నప్పటికీ ప్రజల భాగస్వామ్యం లేకుండా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం సాధ్యం కాదని డీజీపీ స్పష్టం చేశారు.