నిందితులను వదిలే ప్రసక్తే లేదు
ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
మినిట్ 2 మినిట్, అమరావతి(ఆగస్ట్ 10): రాజమహేంద్రవరంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్సపొందుతున్న పీజీ వైద్య విద్యార్థిని ప్రియాంక మరణం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. భవిష్యత్తులో ఉత్తమ వైద్యురాలిగా ఎంతోమందికి ప్రాణదానం చేస్తూ వైద్యసేవలు అందించాల్సిన ప్రియాంక ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడం అత్యంత బాధాకరమని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై బాధ్యతారాహిత్యంగా, తీవ్ర నిర్లక్ష్యంతో కారు నడిపి ఈ ఘోర ప్రమాదానికి కారణమైన నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో నిండు ప్రాణాలను బలితీసుకునే వారిపై చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు. ప్రియాంక మృతితో తీవ్ర శోకసంద్రంలో మునిగిన ఆమె కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. ఈ కష్ట సమయంలో ప్రభుత్వం వారికి పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
