Fidel Castro: ఫిడేల్ క్యాస్ట్రో శత జయంతి!

మినిట్ 2 మినిట్ ( ఆగష్టు13) : నేను లావోస్ వెళ్ళి వస్తూ వియత్నాంలో కావాలని దిగాను. అక్కడి వీధుల్లో తిరగాలని, స్థానికులతో మాట్లాడాలని అనిపించింది. ఆ దేశ రాజధాని హనోయ్ లో ఉన్న Hỏa Lò Prison (Maison Centrale or the Central Prison) సందర్శించాను. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని ఫ్రెంచ్ ప్రభుత్వం నిర్బంధించి, హింసించిన ఒక సెల్లార్ లో పది నిమిషాలు కూర్చున్నాను. నేను చాలా ఉద్వేగానికి గురయ్యాను. ఒకే ఒక లెట్రిన్ అందులోనే ఉన్న ఈ ఇరుకు గదిలో 50 మంది తిరుగుబాటుదారులను నిర్బంధించారు. వారి కాళ్ళకి ఒక ఇనుప చట్రం కట్టి ఉంచారు. ఇంకొక గదిలో మహిళలను హింసించారు. వారి మీద చాలా అఘాయిత్యాయి జరిగాయి. ఫ్రెంచ్, జపాన్, అమెరికా వియత్నాంను వివిధ టైం లైన్స్ లో వెంటాడి వేధించాయి. అయినా వియత్నాం ప్రజలు ముందుకు సాగిపోతున్నారు.

– 26 ఏళ్ల భారతీయ యువకుడు జైలు సందర్శన నుంచి బయటికి రాగానే నాకు ఫోన్ లో చెప్పిన మాటలు ఇవి. హో చి మిన్ నేతృత్వంలో వియత్నాం లో జరిగిన కమ్యూనిస్టు వీరుల పోరాటాన్ని నేను వివరించాను. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ వియత్నాం (CPV) ఆధ్వర్యంలో నడుస్తున్న
single-party socialist republic దేశమైన వియత్నాంలో ప్రజలు అత్యంత శక్తివంతమైన అమెరికాను నిలువరించి విజయం సాధించిన ఘటాన్ని కూడా మాట్లాడుకున్నాం. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన మరొక దేశం క్యూబా గురించి ఈ యువకుడిని కొద్దిగా అవగాహన ఉంది.

ఇవ్వాళ శత జయంతి జరుపుకుంటున్న ఫిడేల్ క్యాస్ట్రో లో Fidel ఈ యువకుడి పేరులో ఉంటుంది. బర్త్ సర్టిఫికెట్ లో కూడా నమోదు అయింది. నియంత పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం, అమెరికా ఆంక్షలకు వెరవకుండా క్యూబా ను విద్యా, వైద్య రంగాల్లో అగ్రగామిగా నిలిపిన విషయం కూడా తనకు తెలుసు. విదేశీ పర్యటనలో తనను కలిసిన క్యూబా దేశస్థుల నుంచి ఆ దేశం గురించి తెలుసుకునే అవకాశం కూడా వచ్చింది. చెగువేరా పోరాటం, ఫిడెల్ క్యాస్ట్రో సంస్కరణలు… ఆయన మీద జరిగిన హత్యా యత్నాలు, రౌల్ క్యాస్ట్రో పాలన, వారి మీద మయామి మాఫియా చేసే ఆరోపణలు వంటివి కొద్దిగా అవగాహన ఉన్నాయి.

మనవాళ్ళు భారత స్వతంత్ర్య సంగ్రామ సమయంలో, అంతకు ముందు కూడా ఎన్నో హింసలకు గురయ్యారు కానీ వియత్నాం లో లాగా ఆ పోరాట స్ఫూర్తి యువ తరానికి తెలిపే ఏర్పాటు లేదు కదా?
కమ్యునిజం అంటే ప్రభుత్వాలకు ఎందుకు భయం? వంటి ప్రశ్నలు అడిగాడు. అధ్యయనం చేసి ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలని చెప్పి ఊరుకున్నాను. దేవుడు, మతం, రాజకీయ సిద్ధాంతాల విషయంలో ఎవరికి వారు ఆసక్తి కనబరిచి అధ్యయనం చేసి అభిప్రాయాలు ఏర్పరచుకోవాలన్నది నా లెక్క. ఈ సిద్ధాంతాలలో ఎంత దమ్ము ఉన్నా అవి కాల మాన పరిస్థితులు, నాయకుల ప్రవర్తన, చిత్తశుద్ధి వల్ల వాటి మీద మన ఆకర్షణ/ ఏవగింపు ఉంటాయన్నది స్వానుభవం.

స్పోర్ట్స్ కెరీర్ గా ఉండి ఒక యాభై దేశాల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించిన తన కుమారుడు తనంతట తాను వియత్నాం లో ఆగి, అక్కడి పరిస్థితులు అవగతం చేసుకునే ప్రయత్నం చేయడం, ప్రపంచ రాజకీయాల్లో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం గురించి ప్రస్తావించడం ఏ తండ్రికైనా గర్వకారణమే కదా! కావడి మోస్తున్న వియత్నాం మహిళ నమూనా కొని తెచ్చి టేబుల్ మీద పెట్టి అక్కడి స్థితి గతుల గురించి మాట్లాడడం ఆనందదాయకమే కదా!