ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ పాఠశాలలో తనిఖీలు
మెనూ ప్రకారం టిఫిన్ పెట్టకపోవడంపై చైర్మన్ ఆగ్రహం
క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ చేయాలని ఆదేశం
మినిట్ 2 మినిట్, రంగారెడ్డి (ఆగస్ట్ 14): రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని తెలంగాణ పబ్లిక్ పాఠశాలను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, కమిషన్ సభ్యులు ఓరిగంటి ఆనంద్, శారద, భారతి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని కిచెన్, వంట పాత్రలు, డైనింగ్ హాల్‌తో పాటు విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారాన్ని లోతుగా పరిశీలించారు.
ఈ సందర్భంగా చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, సభ్యుడు ఓరిగంటి ఆనంద్ మాట్లాడుతూ.. పాఠశాలలో చదువుతున్న 2,500 మంది విద్యార్థులకు ఆహార భద్రత చట్టం ప్రకారం మెనూ అందించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. వండిన భోజనం నాణ్యత బాగానే ఉన్నప్పటికీ, ఉదయం వేళ మెనూ ప్రకారం ఇవ్వాల్సిన టిఫిన్‌కు బదులు అన్నం పెడుతుండటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆరోగ్యకరంగా ఎదగాలంటే ప్రతిరోజూ ఇడ్లీ, దోశ, పూరీ, ఉప్మా, బోండా, చపాతీ, రాగిజావ వంటి పౌష్టికాహారాన్ని మార్చి మార్చి అందించాలని స్పష్టం చేశారు.
పాఠశాలలో హెచ్‌ఎం సిద్ధగోని గిరిధర్ గౌడ్ తక్షణమే మెనూ బోర్డును ఏర్పాటు చేసి, రోజువారీ వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతినెలా వైద్య పరీక్షలు నిర్వహించేలా వైద్యాధికారిని నియమించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించకపోయినా, మెనూ పాటించకపోయినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాలను కూడా కమిషన్ బృందం తనిఖీ చేసి, అక్కడి సమస్యలను అడిగి తెలుసుకుంది.
