అడ్వాన్స్‌గా విద్యార్థుల ఖాతాల్లోకే నగదు!
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రేవంత్ సంచలన ప్రకటన
ఈ ఏడాది నిధుల కోసం రూ.2400 కోట్లు ఇప్పటికే జమ
కాలేజీలు సర్టిఫికెట్లు ఆపే ప్రసక్తే ఉండదన్న సీఎం
మినిట్ 2 మినిట్, హైదరాబాద్(ఆగస్ట్ 15): రాష్ట్రంలో పేద విద్యార్థుల ఉన్నత చదువులకు నిధుల కొరత అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇకపై విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అడ్వాన్స్ నిధులను నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ట్యాంక్ బండ్ HMDA గ్రౌండ్స్‌లో మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల కోసం ఇప్పటికే రూ.2400 కోట్లను బ్యాంకుల్లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు. కళాశాలల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోపే ఈ డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతాయని స్పష్టం చేశారు. సర్కారు చెల్లింపులు ఆలస్యమయ్యాయనే నెపంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆపివేసే పరిస్థితికి ఇకపై చెక్ పడుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
స్కిల్స్ ఉన్నారికే గ్లోబల్ అవకాశాలు!
సమాజంలో కుల నిర్మూలన, నాణ్యమైన విద్యే ధ్యేయంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని సీఎం తెలిపారు. కేవలం డిగ్రీ సర్టిఫికెట్లు ఉన్నంత మాత్రాన ఉద్యోగాలు వచ్చే రోజులు పోయాయని, సాంకేతిక, భాషా నైపుణ్యాలు (స్కిల్స్) ఉన్నవారికే అంతర్జాతీయంగా మంచి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంతో ఐటీ రంగంలో వస్తున్న మార్పులను తట్టుకునేలా విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపరుచుకోవాలని, అందుకే ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తూ ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని సీఎం వివరించారు.
