దేశవ్యాప్తంగా నిలిచిపోయిన యూపీఐ సేవలు
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వినియోగదారులు
ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంలలో ఫెయిల్ అయిన లావాదేవీలు
మినిట్ 2 మినిట్, హైదరాబాద్(ఆగస్ట్ 15): దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ డిజిటల్ షాక్‌కు గురైంది. ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవల్లో తీవ్ర సాంకేతిక అంతరాయం తలెత్తడంతో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్‌ల ద్వారా చెల్లింపులు నిలిచిపోయాయి. శుక్రవారం ఉదయం నుంచి ఏ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ కూడా పూర్తికాకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పిన్ ఎంటర్ చేసిన తర్వాత స్క్రీన్‌పై కేవలం ‘లోడింగ్’ అని మాత్రమే కనిపిస్తోందని, చెల్లింపు సక్సెస్ అయినట్లు మెసేజ్ రాకపోవడంతో ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యాయో లేదో తెలియక జనాలు అయోమయానికి గురయ్యారు. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులు, పెట్రోల్ బంకులు, నిత్యావసర దుకాణాల వద్ద డిజిటల్ పేమెంట్లు కాకపోవడం, చేతిలో నగదు లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడ్డారు.
ట్విట్టర్‌లో హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్!
ఈ సమస్యపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ నిరసనను వ్యక్తం చేశారు. #UPIDown, `#UPI’ హ్యాష్‌ట్యాగ్‌లతో ఎక్స్ (ట్విట్టర్) లో పోస్టులు పెడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. క్యాష్‌లెస్‌గా మారిన డిజిటల్ కాలంలో ఇలాంటి సాంకేతిక సమస్యలు పదేపదే రావడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
