Arekapudi Gandhi: సాహితీ ఇన్‌ఫ్రా సంస్థ నుంచి తన ఖాతాలోకి రూ.2.1 కోట్లు వచ్చినట్లుగా జరుగుతున్న ప్రచారంపై పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) ఛైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ స్పందించారు. ఈ వ్యవహారంపై మీడియాలో వస్తున్న కథనాలపై ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ స్పష్టత ఇచ్చారు. సాహితీ సంస్థ నుంచి తమ ఖాతాకు డబ్బులు వచ్చాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఆ సొమ్ము తమకు వ్యక్తిగత లబ్ధి కోసమో లేదా ఇతర ప్రయోజనాల కోసమో వచ్చింది కాదని తేల్చి చెప్పారు.
ఆ నగదు లావాదేవీకి సంబంధించిన నేపథ్యాన్ని వివరిస్తూ.. 2018లో ఆఫీస్ స్థలం కొనుగోలు చేయడం కోసం తమ ఖాతా ద్వారా సదరు సాహితీ సంస్థకు రూ.2.1 కోట్లు చెల్లించినట్లు గాంధీ వెల్లడించారు. అయితే సాంకేతిక కారణాల వల్ల ఆ స్థలాన్ని కేటాయించడం సాధ్యపడకపోవడంతో, ఆ సంస్థ తాము చెల్లించిన రూ.2.1 కోట్ల మొత్తాన్ని తిరిగి తమ ఖాతాకే జమ చేసిందని వివరించారు. ఈ లావాదేవీని కేవలం గతంలో తాము చేసిన చెల్లింపుల రీఫండ్‌గా మాత్రమే చూడాలని, అందువల్ల ప్రసార సాధనాలు వాస్తవాలను గ్రహించి వార్తలను ప్రసారం చేయాలని కోరారు.
సాహితీ సంస్థ సాగిస్తున్న వ్యాపార కార్యకలాపాలతో గానీ, వారి ఇతర వ్యవహారాలతో గానీ తమకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ స్పష్టం చేశారు. కేవలం తమ ఖాతా ద్వారా జరిగిన రీఫండ్ లావాదేవీని ఆ సంస్థ వ్యాపారాలతో ముడిపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. సాహితీ ఇన్‌ఫ్రా సంస్థ వ్యవహారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుపుతూ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఇచ్చిన ఈ వివరణ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
