Lok Adalat: సమయం, డబ్బు ఆదా.. రంగారెడ్డి జిల్లా కోర్టులో లోక్ అదాలత్ గ్రాండ్ సక్సెస్!

District Legal Services Authority officials holding a Special Lok Adalat for the settlement of NI Act (Cheque Bounce) cases in Ranga Reddy district court.

ఒకే రోజు 95 ఎన్‌ఐ యాక్ట్ కేసుల క్లియరెన్స్!

మినిట్2మినిట్ డెస్క్, రంగారెడ్డి: కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్‌లు ఒక చక్కని వేదికగా నిలుస్తున్నాయని రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి (డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి) ఎ. కర్ణ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (TSLSA) ఆదేశాల మేరకు, శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ‘నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్’ (ఎన్‌ఐ యాక్ట్ – చెక్ బౌన్స్) కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక లోక్ అదాలత్‌ను నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ హోదాలో జడ్జి కర్ణ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలకు తక్కువ ఖర్చుతో, వేగంగా, ఉచిత న్యాయ సేవలను అందించడమే లోక్ అదాలత్‌ల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. రాజీ పడటానికి అవకాశం ఉన్న కేసులను ఇరుపక్షాలు కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. లోక్ అదాలత్ ద్వారా లభించే తీర్పుతో వివాదాలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని, కక్షిదారులు ఈ అవకాశాన్ని మరింతగా ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

15 ప్రత్యేక బెంచీలు.. 95 కేసుల పరిష్కారం:

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అనూష మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను త్వరగా ముగించేందుకు ఈ రోజు జిల్లా వ్యాప్తంగా 15 ప్రత్యేక బెంచీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా 95 ఎన్‌ఐ యాక్ట్ కేసులను ఇరు వర్గాల అంగీకారంతో విజయవంతంగా పరిష్కరించినట్లు ఆమె వెల్లడించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ప్రత్యేక లోక్ అదాలత్‌ల ద్వారా పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన న్యాయమూర్తులు, న్యాయ సేవాధికార సంస్థ అధికారులు, సీనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పెద్ద సంఖ్యలో కక్షిదారులు పాల్గొన్నారు.