ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ.. స్పాట్ లో!

Road Accident

Road Accident

Road Accident: హైదరాబాద్ నగర శివారులోని హయత్ నగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంట్లూరు రాజీవ్ గృహకల్ప వద్ద ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టడంతో సుమారు ఇరవై మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

రాజీవ్ గృహకల్ప డిపో వద్ద ప్రయాణికులను ఎక్కించుకుని బయలుదేరిన హయత్ నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మెయిన్ రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో నాగోల్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ బస్సును నేరుగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు బస్సులోని ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోవడంతో పలువురికి రక్తగాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను బస్సులో నుంచి బయటకు తీసి, చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.