సీఈసీ జ్ఞానేష్ కుమార్ తప్పుకోవాల్సిందే.. లేదంటే ముంబై వేదికగా దేశవ్యాప్త ఉద్యమం

CEC Resignation

CEC Resignation

CEC Resignation: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) బృహత్తర దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చింది. సీఈసీ తన పదవి నుంచి తప్పుకోకపోతే అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ముంబై వేదికగా నిరసనలు ప్రారంభిస్తామని సీజేపీ జాతీయ కన్వీనర్ అభిజీత్ దీపే సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.

శనివారంలోగా సీఈసీ తన రాజీనామాను సమర్పించకపోతే, గాంధీ జయంతి నాటి నుంచి ముంబైలో నిరసనలు మొదలుపెట్టి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఈ ప్రజా ఉద్యమాన్ని విస్తరిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ గాంధీ జయంతి వేళ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు.

ఎస్ఈఆర్ ప్రక్రియలో భాగంగా ఇతర ఎన్నికల కమిషనర్లను పక్కనపెట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, కోట్ల సంఖ్యలో ఓట్ల తొలగింపు వంటి తీవ్రమైన ఆరోపణలు వస్తున్న తరుణంలో సీజేపీ ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది. పౌరుల ఓటు హక్కును హరిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాలరాసే విధానాలను ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేసింది.

రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా పోరాడటానికి ఇదే సరైన సమయమని పార్టీ నేతలు పేర్కొన్నారు. శనివారంలోగా సీఈసీ స్థానం నుంచి తొలగిపోకపోతే ఢిల్లీలోని జంతర్ మంతర్ 2.0 తరహాలో భారీ ప్రజా నిరసనలు చేపడతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సీజేపీ ఆందోళనా పిలుపుతో జాతీయ రాజకీయాల్లో, ఎన్నికల సంఘం చుట్టూ ముసురుకున్న వివాదం తీవ్ర రూపాన్ని దాల్చింది.