TELANGANA: విద్యార్థి గొంతు పట్టిన సీఐ సస్పెన్షన్!

విద్యార్థి గొంతు పట్టిన సీఐ సస్పెన్షన్!
విచారణకు ఆదేశించిన జిల్లా ఎస్పీ శబరీష్

మినిట్ 2 మినిట్, మహబూబాబాద్ (ఆగస్ట్ 21): కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించి, ఒక విద్యార్థి గొంతు పట్టుకున్న మహబూబాబాద్ టౌన్ సీఐ రఘుపతిరెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సదరు సీఐని విధులనుంచి తాత్కాలికంగా తప్పిస్తూ ఎస్పీ శబరీష్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన సందర్భంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఓ విద్యార్థి గొంతును సీఐ రఘుపతిరెడ్డి దౌర్జన్యంగా పట్టుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై ప్రజాసంఘాలు, విద్యార్థుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. సీఐను సస్పెండ్ చేయడంతో పాటు సంఘటనపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా డీఎస్పీ స్థాయి అధికారిని స్పందించిన జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశించారు. నివేదిక అందగానే తదుపరి కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ స్పష్టం చేశారు.