భారతీయులున్న నౌకపై ఇరాన్ కాల్పులు
హార్మూజ్ జలసంధిలో కంటైనర్ షిప్‌పై ఇరాన్ ఐఆర్‌జీసీ దాడి
చిన్న బోట్లతో చుట్టుముట్టి రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లతో విరుచుకుపడ్డ సైనికులు
వీడియోను విడుదల చేసిన ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా
మినిట్ 2 మినిట్, జాతీయ బ్యూరో (ఆగస్ట్ 22 ): పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ హార్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఇండియన్ కంటైనర్ నౌకపై ఇరాన్ దళాలు దాడి చేసిన ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన సంచలనాత్మక వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత నావికుల సమాఖ్య అయిన ‘ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (FSUI) ఈ వీడియోను అధికారికంగా విడుదల చేసింది.
ఏప్రిల్ 22న పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఈ కంటైనర్ షిప్‌ను ఇరాన్ ఐఆర్‌జీసీ (IRGC) దళాలు చిన్న బోట్లలో వచ్చి చుట్టుముట్టాయి. అనంతరం నౌకపైకి రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లను ప్రయోగిస్తూ తీవ్రస్థాయిలో కాల్పులు జరిపాయి. ఈ హఠాత్ పరిణామంతో తీవ్ర భయాందోళనకు గురైన నావికులు కాల్పుల నుంచి తప్పుకునేందుకు కంటైనర్ల మధ్య దాక్కున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ నౌకలో మొత్తం 22 మంది సిబ్బంది ఉండగా, అందులో ఏకంగా 21 మంది భారతీయులే ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. యుద్ధ ప్రాంతాల్లో ప్రయాణించే భారతీయ నావికుల భద్రతపై ఈ ఘటనతో మళ్లీ పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నావికుల భద్రతను సమీక్షించి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని యూనియన్ వర్గాలు కోరుతున్నాయి.
